తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక..! బీజేపీ ఏంటీ ఇంత స్పీడ్ గా ఉంది..!!

కేంద్రంలో వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టింది బీజేపీ. దీంతో.. దేశమంతా కాషాయ రంగు పులిమేయాలని మోదీ – షా ద్వయం ఆలోచన. కేంద్రంలో తమ సింహాసనం కాపాడుకుంటూనే అన్ని రాష్ట్రాల్లో తమ సామంత రాజులను నియమించేసి బీజేపీ జెండాలు పాతేయాలనేది వారి లక్ష్యం. కొన్ని రాష్ట్రాల్లో సంకీర్ణాలను విచ్ఛిన్నం చేసి.. మరికొన్ని రాష్ట్రాల తప్పులను, పరిస్థితులను అవకాశంగా చేసుకుని తమ గుప్పిట్లో పెట్టుకుంటోంది. ఏపీలో మాత్రం వారి పప్పులు ఉడకడం లేదు. అయితే.. ప్రస్తుతం ఏపీ బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. జనసేన తోడుందనే ఆనందమో.. జగన్ తప్పులు చేసి దొరికిపోతున్నాడనే సంతోషమో.. టీడీపీ పతనమైపోతోందనే అత్యుత్సాహమో కానీ.. బీజేపీ బండికి బ్రేకులు పడటం లేదు. తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉపఎన్నికకు అప్పుడే రంగం సిద్ధం చేసేస్తోంది.

bjp speed about tirupathi mp by elections
bjp speed about tirupathi mp by elections

అందరికంటే ముందే అభ్యర్ధిని ఖరారు చేసింది..

తిరుపతి పార్లమెంటు స్ధానానికి అభ్యర్ధిగా స్థానికుడైన దాసరి శ్రీనివాసులును బీజేపీ ఖరారు చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సమరసత సేవా  ఫౌండేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మత్స్యకారులు-దళిత-గిరిజనులకు వేదం నేర్పించి.. రాష్ట్రంలో ఫౌండేషన్ నిర్మించే దేవాలయాల్లో ఎస్సీ-ఎస్టీ-బీసీలను అర్చకులుగా  నియమించడం.. తిరుపతి పార్లమెంటు పరిథిలో పేద-అనాధ-వీధి బాలలను గుర్తించి.. కొన్ని వేల మంది పిల్లలను గురుకుల పాఠశాలలో చేర్పించారు శ్రీనివాసులు. రాజకీయంగా.. బీజేపీ-జనసేన జోడీ, టీడీపీ బలహీనపడుతూండటం, ప్రభుత్వ వ్యతిరేకత.. తమకు లాభిస్తుందనే ఆలోచనలో ఉంది బీజేపీ. వాజపేయి హయాంలో మాజీ ఏఐఎస్ వెంకటస్వామి బీజేపీ అభ్యర్ధిగా.. వైసీపీ నుంచి మాజీ అధికారి వరప్రసాద్ గతంలో గెలిచారు. ఈ సెంటిమెంట్ ను కూడా బీజేపీ ఫాలో అవుతూ మాజీ ఐఏఎస్ అధికారి అయిన దాసరి శ్రీనివాసులును తమ అభ్యర్ధిగా నిలబెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం.

వైసీపీ, టీడీపీల్లో ప్రస్తుతానికి ఆ ఆలోచన కూడా లేకపాయే..

ఇతర పార్టీల కంటే ముందే అభ్యర్ధి విషయంలో నిర్ణయం తీసుకుంది బీజేపీ. రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగిందంటున్నారు. కానీ.. వైసీపీ, టీడీపీ ఇంకా ఆ ఆలోచనే చేయలేదు. నిజానికి రాష్ట్రంలో సీఎం జగన్ ఛరిష్మా, ప్రస్తుత వీస్తున్న వైసీపీ గాలితో ఎవరు గెలుస్తారో స్పష్టంగా తెలుస్తున్నా.. బీజేపీ మాత్రం ఎందుకో బ్రేకులు లేకుండా వెళ్తోంది. చూద్దాం ఎన్నాళ్లు వెళ్తుందో..!