సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసేలా తెలంగాణలో బీజేపీ ప్లాన్లు వేస్తోందా..!? అంటే ఈ చిన్న వివరణ చదవాల్సిందే..! ‘స్టేషన్ లోని చివరి ఫ్లాట్ ఫామ్ పై రైలు ఆగి ఉంది. ట్రైన్ నిండా జనం ఉన్నారు. ఇంజిన్ లో డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ ఉన్నారు. రైలు కదిలేందుకు సిద్ధంగా ఉంది. కానీ.. జనం ఆ రైలుపై, డ్రైవర్లపై కోపంగా ఉన్నారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ అయినా నెమ్మదిగా తీసుకెళ్తున్నారని. రైలు నెమ్మదిగా కదిలింది. ఇంతలో కొందరు ప్రయాణికులు ఆ చివర ప్లాట్ ఫామ్ పై ఉన్న రైలు కోసం పరుగులు పెడుతున్నారు. రైలు ఎక్కగలిగితే ప్రయాణంలో తర్వాతి స్టేషన్ వచ్చే సరికి ప్రయాణికులను ఒప్పించి.. కొత్త రైలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే.. వీరిప్పుడు కదులే రైలు ఎక్కాల్సి ఉంది’ ఇదే ఆ వివరణ..! రైలు టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రయాణికులే రాష్ట్ర ప్రజలు, కదిలే రైలు ఎక్కుతున్న వారు బీజేపీ నాయకులు. డ్రైవర్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్. వివరాల్లోకి వెళ్తే..

సీఎం కేసీఆర్ కే షాకిచ్చేలా..
రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని బలహీనం చేసి, ఇతర పార్టీల ఉనికి లేకుండా చేసారని పేరు తెచ్చుకున్నారు సీఎం కేసీఆర్. కానీ.. ఆయనకు తెలీకుండానే బీజేపీ ఉవ్వెత్తున ఎగిరింది. ఆ నిజాన్ని తెలుసుకోవడానికి సీఎం కేసీఆర్ కు ఎంతోకాలం పట్టలేదు. 2019 ఎంపీ ఎన్నికల్లో కుమార్తె కవిత ఓటమి ఆయనకు ఊహించని తొలి షాక్ తగిలింది. అయితే.. దీనిని రాజకీయాల్లో సహజంగా ఎదురయ్యే ఓటమిగా తీసుకున్న కేసీఆర్ కు దుబ్బాక ఉప ఎన్నిక ఉలిక్కిపడేలా చేసింది. సానుభూతి ఓట్లు కూడా దక్కించుకోలేక.. లక్ష మెజారిటీ అని కలలు కంటూ ఉన్న టీఆర్ఎస్ అధినేతకు కుమార్తె ఓటమి సహజంగా జరిగింది కాదని తేరుకునేలా చేసింది. ఇలా ఎలా జరిగింది అని అంతఃశోధన చేసుకునేలోపే జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు గులాబీ బాస్ ను ఊపిరాడకుండా చేశాయి. విశేషమేంటంటే.. కేసీఆర్ కు ఈ మూడు చోట్లా చుక్కలు చూపింది ‘బీజేపీ’నే. తెలంగాణలో తమకు తిరుగే లేదనుకుని కుందేలులా పరుగులెట్టిన టీఆర్ఎస్ ను నెమ్మదిగా వచ్చి విజయం సాధించిన తాబేలులా బీజేపీ దూసుకెళ్లిపోయింది.
సర్వం సిద్ధమవుతోన్న బీజేపీ..
బీజేపీ తెలంగాణలో సాధించిన ఈ మూడు విజయాలు సామాన్యమైనవి కావు. గాలివాటంగా వచ్చినవి కావు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు ఇవి ఉదాహరణలు. పార్టీగా బీజేపీకే ఈ నిజం తెలిసినప్పుడు.. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు సీఎం కేసీఆర్ కు తెలీందేమీ కాదు. కాకపోతే సాధారణ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి పరిస్థితులు చక్కబెడదాం అనే ఆలోచనలో గులాబీ బాస్ ఉండొచ్చు. కానీ.. బీజేపీ అలా ఆలోచించడం లేదు. కదిలే రైలు అందుకుంది. ప్రయాణికులతో మమేకమై రైలు పగ్గాలు అందుకునేందుకు సిద్ధమవుతోంది. అందుకు ఇప్పటినుంచే సమాయాత్తమవుతోంది. ఇటివల మూడు రోజులపాటు జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశాల్లో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవశ్యకతపై చర్చించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలసత్వం కూడదని నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఉండాల్సిన దూకుడును ఇప్పటినుంచే చూపాలని తీర్మానించింది. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్రమంతా క్షేత్రస్థాయిలో పార్టీని క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు రాష్ట్ర పర్యటన చేయాలని సంకల్పించింది. ప్రజలకు కొత్త ప్రభుత్వం ఆవశ్యకతను, ప్రస్తుత ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు సిద్ధమైంది.
ప్రభుత్వ వైఫల్యాలే బీజేపీ ఎజెండా..
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చెప్పిన దళిత ముఖ్యమంత్రి హామీ నుంచి.. సీఎం అయ్యాక ఇప్పటి వరకూ నెరవేర్చని పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, అభివృద్ధి, అవసరం లేకపోయినా కొత్త సచివాలయం నిర్మాణం పేరుతో ప్రజాధనం వృధా, అవనీతి, వరదలు, ఇంటర్మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యల సందర్భంలో కూడా ప్రజల్లోకి రాని ముఖ్యమంత్రి, సచివాలయంకు, ప్రగతి భవన్ కు కూడా రాని సీఎం.. అంటూ ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ ప్రజల్లోకి ఇప్పటినుంచే తీసుకెళ్లే ప్రణాళికలు వేస్తోంది. బీజేపీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తామో.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిపాలన, ఇళ్ల నిర్మాణం, రైతు సమ్మాన్ నిధి, అయోధ్య రామాలయ నిర్మాణం.. ఇలా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని భావిస్తోంది. మొత్తంగా ఇప్పటినుంచే టీఆర్ఎస్ ను ఢీ కొట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. బీజేపీ.. అందివచ్చిన ఉట్టిని కొట్టేందుకు ఎంత ఆయాసం వచ్చినా ఏమేరకు ప్రయత్నిస్తుందో చూడాల్సి ఉంది.