‘అభివృద్ధి కాదు.. కబ్జాలే’

42 views


విశాఖపట్నం: ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ఆత్మయ సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. భీమిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. అయితే, భూ కబ్జాలు మాత్రం యథేచ్ఛంగా సాగుతున్నాయని బొత్స ఆరోపించారు. కలెక్టర్ ఆఫీస్‌లో భూ రికార్డులు తారుమారు అవుతున్నాయంటేనే.. మంత్రి గంటా తీరును అర్థం చేసుకోవచ్చని అన్నారు.

ఓట్ల కోసమో, అధికారం కోసమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటం చేయడం లేదని.. సుపరిపాలన కోసమేనని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాయలు, అబద్ధాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి కుర్చీ కావాలని పదే పదే విమర్శలు చేస్తున్నారని.. అయితే రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం జగన్ సీఎం కావాలని అన్నారు.

ఇది ఇలా ఉండగా, వైసీపీ ఎమ్మెల్యే రోజా.. సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. జగన్ ప్రజాదరణ చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డిని సినీనటుడు నాగార్జున కలిసినా చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, ఆయనలో అసహనం పెరిగిపోయిందని అన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. నేర చరిత్ర కలిగిన వారిని పక్కన పెట్టుకుంది చంద్రబాబేనని.. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనదేనని అన్నారు. ఇంట్లో బాంబు పేల్చిన కోడెల శివప్రసాదరావు, గన్ పేల్చిన బాలకృష్ణను పక్కన పెట్టుకుంది చంద్రబాబు కాదా? అని రోజా ప్రశ్నించారు.

‘హత్యా రాజకీయాలను ప్రోత్సహించింది చంద్రబాబేనని, అందుకే ఆపరేషన్ గరుడ ప్లాన్‌తో జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి కుట్ర పన్నారు. చంద్రబాబుపై 18 కేసులున్నాయని, విచారణకు హాజరుకాకుండా తిరుగుతున్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పూరితంగా జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టాయి. అయినా జగన్ విచారణకు హాజరవుతున్నారు. ఐదేళ్లు చంద్రబాబు ఎన్ని యూటర్న్‌లు తీసుకున్నారో ప్రజలు గమనిస్తున్నారు’ అని రోజా వ్యాఖ్యానించారు.