‘వివాదంలోని లేని అయోధ్య భూమి అప్పగించాలి’

ఢిల్లీ, జనవరి 29: అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో కేంద్రం మంగళవారం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. వివాదంలో లేని 67 ఎకరాల భూమిని రామజన్మభూమి (టస్ట్) న్యాస్‌కు అప్పగించాలని కోరింది. 2.7 ఎకరాల భూమి మాత్రమే వివాదాస్పదంగా ఉందని పిటిషన్‌లో ప్రస్థావించింది.

అయోధ్య కేసు విచారణకు ఈ నెల 25న సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో నూతన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. తొలుత ఏర్పాటు చేసిన ధర్మాసనం నుండి జస్టిస్ లలిత్ తప్పుకున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ధర్మాసనంలో మార్పులు చేశారు. జస్టిస్ భూషణ్, జస్టిస్ నజీర్‌లను నూతన ధర్మాసనంలో సభ్యులుగా నియమించారు.

ఈ వివాదానికి సంబంధించి వ్యక్తిగత ధార్మిక సంస్థల నుండి 14 పిటీషన్‌లు దాఖలు అయి ఉన్నాయి. 1528లో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణం జరగ్గా.. గుడి కూల్చేసి దానిపై మసీదు కట్టారన్నది హిందు గ్రూపుల వాదన. స్థలం ఎవరిది అన్న విషయంపై 2010 సెప్టెంబరులో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వివాదానికి సంబంధించి మొత్తం 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని పేర్కొంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 14 పిటీషన్లు దాఖలు అయి ఉన్నాయి.

‘సుప్రీం కోర్టు ఈ వివాదాన్ని త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని’ ఇటీవల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ పేర్కొన్నారు. కోర్టు పరిష్కరించలేని పక్షంలో తాము 24గంటలు దాటకముందే సమస్య పరిష్కారం చూపుతానని కూడా యోగి చెప్పారు. అనేక కోట్ల మంది ప్రజలు కోర్టు తీర్పు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.