‘హవాలా డబ్బు కోసమే విదేశీ పర్యటన’

అమరావతి, ఫిబ్రవరి 22: వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి లండన్ పర్యటనపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీ నేతలతో శుక్రవారం ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో జగన్ లండన్ పర్యటనపై చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఎవ్వరూ విదేశీ పర్యటనలకు వెళ్లరని అన్నారు.

హవాలా డబ్బులు తెచ్చేందుకే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాడని చంద్రబాబు ఆరోపించారు. కేసుల మాఫీకి బిజెపితో, డబ్బుల కోసం కెసిఆర్‌తో జగన్ లాలూచీ పడ్డారని చంద్రబాబు విమర్శించారు..
వైసిపి,బిజెపి కుట్రలపై ప్రజల్లో చర్చ జరిగేలా పార్టీ శ్రేణులు చూడాలని చంద్రబాబు అన్నారు. స్థానికంగా వైసిపి ప్రలోభాలను ఎండగట్టాలని చంద్రబాబు సూచించారు.

‘దొంగే, దొంగ..దొంగ’ అన్నట్లుగా వైసిపి వ్యవహరిస్తోందనీ, వాళ్లు చేసే తప్పుడు పనులు ఇతరులకు ఆపాదిస్తారని చంద్రబాబు అన్నారు. తప్పుడు సర్వేలతో ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
దొంగ ఓట్లు చేర్చేది వాళ్లే, ఫిర్యాదులు పంపేది వాళ్లేనని చంద్రబాబు అన్నారు.