చంద్రబాబుకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానం

అమరావతి, డిసెంబర్ 31: ప్రయాగలో  జనవరి 15 నుండి జరిగే కుంభమేళా ఉత్సవంలో పాల్లొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ తరుపున ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సతీష్ మహనా ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబును కలిసి  ఆహ్వానం అందజేశారు.

 

వారణాసిలో జనవరి 21 నుంచి మూడురోజులపాటు జరిగే ప్రవాస భారత దినోత్సవానికి కూడా హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందించారు. యూపీ మంత్రి సతీష్ మహనా మాట్లాడుతూ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల అమలులో చంద్రబాబే తనకు స్పూర్తి అంటూ ముఖ్యమంత్రిని ప్రశంసలతో ముంచెత్తారు. ప్రజలకు సేవ చేయాలన్న తపనతో నిరంతరం శ్రమించే నేత అంటూ ముఖ్యమంత్రిని ఆయన అభినందించినట్లు సమాచారశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

‘ఆనాడు మీరు హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధిని స్పూర్తిగా తీసుకుని తాను గతంలో యూపీ పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అమలు చేశానని గుర్తు చేసుకున్నారు. మీ హయంలో రాష్ట్రాభివృద్ది, పాలనా వ్యవహారాల్లో సాధిస్తున్న విజయాలను చూసి మిమ్మలను సీఆవొ అని ముద్దుగా పిలుచుకునే వారం’ అని  ఆయన గుర్తు చేసుకున్నట్లు ప్రకటన తెలిపింది. ఈ సమావేశంలో సీఎం కార్యదర్శులు రాజమౌళి, సాయిప్రసాద్‌లు పాల్గొన్నారు.