చిరుకు జగన్ అపాయింట్‌మెంట్!

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీ నటుడు చిరంజీవి భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ను చిరంజీవి కోరడంతో మెగాస్టార్ కు వైఎస్ జగన్ అపాయింట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సమయంలో సీఎం జగన్ తో ‘సైరా’ మూవీ టీం భేటీ కానుంది. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్‌మెంట్ ఖరారు చేసింది. సైరా హీరో చిరంజీవి, నటుడు, నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలు వైఎస్ జగన్ ను కలవబోతున్నారు. సైరా సినిమాకు సంబంధించిన విషయాల గురించి ముఖ్యమంత్రితో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత చిరంజీవి ఆయనతో సమావేశం కాలేదు. చాలా కాలంగా వీరిద్దరూ కలిసింది కూడా లేదు. చిరంజీవి తొలి సారి జగన్ ను కలవటానికి అమరావతికి వస్తున్నారు. దీంతో ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను కలిసిన చిరంజీవి తన సినిమా చూడటానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. గవర్నర్ కు హైదరాబాద్ లో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా స్పెషల్ షో వేసి చూపించారు చిరంజీవి. అనంతరం ఈ సినిమా చాలా బాగుందంటూ గవర్నర్ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ను కూడా సైరా సినిమా విషయంలోనే కలవబోతున్నారు చిరంజీవి. ఈ సినిమాకు ఏపీలో ప్రత్యేక షోలు వేసేందకు జగన్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం జగన్ కు చిరంజీవి ధన్యవాదాలు తెలుపనున్నారని సమాచారం. కారణం సైరా సినిమా అయినా చిరంజీవి నేరుగా వచ్చి జగన్ తో సమావేశం కానుండడంతో అటు సినీ..ఇటు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత ఏర్పడింది.