Telangana Elections: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం అర్ధరాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్ధి గువ్వల బాలరాజు వాహనంలో డబ్బులు తరలిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరువర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్వల్పంగా గాయపడినట్లుగా తెలుస్తొంది. అనంతరం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.
సేకరించిన వివరాల ప్రకారం.. అచ్చంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్రమంగా డబ్బు సంచులు తరలిస్తున్నారనే అనుమానంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఓ వాహనాన్ని ఉప్పునుంతల మండలంలోని వెల్టూర్ గేట్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారు ఆపకపోవడంతో దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు వెంబడించారు. అచ్చంపేటలోని అంబేద్కర్ కూడలిలో ఆ కారును అడ్డుకొని రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. ఈ రాళ్ల దాడిలో కొందరు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ సందర్భంలో ఇరుపార్టీల నాయకులు పోటాపోటీగా నిరసన తెలిపారు.
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్ధి వంశీకృష్ణ అక్కడకు చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే బాలరాజుకు స్వల్ప గాయాలు అయ్యాయి. కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడి చేశారంటూ బాలరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన బాలరాజుకు అచ్చంపేట లో ప్రాధమిక చికిత్స అందించి అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ అభ్యర్ధి వంశీ కృష్ణ మాట్లాడుతూ .. బీఆర్ఎస్ అభ్యర్ధి వాహనంలో డబ్బులు తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం ఇచ్చినా అడ్డుకోలేదన్నారు. డబ్బున్న సంచులు పట్టించినా ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. గువ్వల బాలరాజుకు ఓటమి భయం పట్టుకుందని అందుకే నాటకాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు పోలీసులే ప్రత్యేక సెక్యురిటీ ఇస్తున్నారని వంశీకృష్ణ ఆరోపించారు.