టీడీపీ ప్రచారానికి ఊపొచ్చింది..! జగన్ మార్క్ సమాధానాలు ఇస్తారా..!?

ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ – టీడీపీ మాటల యుధ్దం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ టీడీపీ.. వాటిని తిప్పికొడుతూ వైసీపీ బిజీగా ఉంటున్నాయి. అయితే.. ఇప్పుడు ఈ మాటల యుద్ధంలో ఒకింత టీడీపీ పేచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు ఆ అవకాశాలు కల్పిస్తున్నాయి. టీడీపీ అధికారంలో ఉండగా అమరావతి, పోలవరం తనకు రెండు కళ్లుగా చెప్పుకొచ్చింది. వాటిపైనే దృష్టి పెట్టింది. చంద్రబాబు కూడా 2019 ఎన్నికల్లో ఇదే అంశాన్ని తీసుకుని జగన్ పై విమర్శలు చేశారు. జగన్ అధికారంలోకి వస్తే ఈ రెండింటి అభివృద్ధి ఆగిపోతుందని చెప్పుకొచ్చారు. ఆనాడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే నేడు నిజమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

cm jagan on dailemma as chandrababu predicts
cm jagan on dailemma as chandrababu predicts

టీడీపీ ఆనాడు చెప్పిందే జరుగుతోందా..?

జగన్ సీఎం అయితే ఏం జరుగుతుందో టీడీపీ ఆనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చెప్పింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలే నిజమవుతున్నాయి. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర కావొస్తోంది. ఈ కాలంలో నిజంగానే అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. రీసెంట్ గా కేంద్రం పెట్టిన కొర్రీలు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. అమరావతిని పక్కన పెట్టినా పోలవరంపై శ్రద్ధ పెట్టాలని భావించిన జగన్ ప్రభుత్వానికి కేంద్రం గట్టి షాకే ఇచ్చింది. ఆర్&ఆర్ ప్యాకేజీకి నో చెప్పడంతో పోలవరం పనులపై వైసీపీ భయపడే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు హయాంలో అమరావతి, పోలవరంపై దృష్టి పెట్టిన చంద్రబాబు ఎంతోకొంత పనులు చేశారు. అవినీతి కూడా అలానే జరిగింది.

సీఎం జగన్ ఇప్పుడేం చేస్తారో..?

జగన్ సీఎం అయ్యాక బాబు హయాంలో జరిగిన అవినీతిపై దృష్టి సారించి ఒకింత మంచి పనే చేశారు. అయితే తన మార్క్ చూపడంలో మాత్రం జగన్ విఫలమవుతున్నారు. అమరావతికి ప్రత్యామ్నాయంగా తెర మీదకు తెచ్చిన మూడు రాజధానుల అంశంలో ముందుకు వెళ్లలేక.. కేంద్రం దెబ్బకి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎలా ముందడుగు వేయాలో తెలీని పరిస్థితిలో జగన్ ఆందోళన చెందుతున్నారు. జగన్ పరిస్థితి ఇప్పుడు టీడీపీకి ఆయధంగా మారింది. గతంలో తాము చెప్పిందే జరిగిందని టీడీపీ ప్రచారం మొదలెట్టింది. దీంతో ఆత్మరక్షణ పడటంలో తప్ప ప్రస్తుతానికి వైసీపీ ఏం చేయలేని పరిస్థితి. మరి.. సీఎం జగన్ ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారో చూడాల్సిందే.