ఇసుక సమస్యపై ‘బాబు’ దీక్ష ‘జగన్’ వారోత్సవాలు!

అమరావతి: రాష్ట్రంలో నెలకొని ఉన్న ఇసుక సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి ఈ నెల 14వ తేదీ నుండి ప్రభుత్వం  ఇసుక వారోత్సవాలను నిర్వహిస్తున్నది. ఇసుక సమస్యపై మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నవంబర్ 14 నుండి 21వ తేదీ వరకూ ఇసుక వారోత్సవాలు జరపాలని సిఎం ఆదేశించారు.ఇసుక కొరత తీరే వరకూ సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోవద్దని కూడా జగన్ ఆదేశించారు. సరిహద్దుల్లోని అన్ని రూట్లలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి పటిష్టంగా అక్రమ రవాణా నిరోధించాలన్నారు. పది రోజుల్లో చెక్‌పోస్టులు, సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆధికారులను జగన్ ఆదేశించారు.

దీనిపై చంద్రబాబు స్పందిస్తూ  ఇసుక సమస్యలపై ఈ నెల 14న విజయవాడలో 12 గంటల పాటు దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన తరువాత ఇసుక అందుబాటు స్వల్పంగా పెరిగిందని వ్యాఖ్యానించారు. 14 నుండి ఇసుక వారోత్సవాల ప్రకటన అందులో భాగమేనని పేర్కొన్నారు. ఇసుక కొరత అనేది రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఆహార కొరత, గ్యాస్ కొరత, నీటి కొరత, విద్యుత్ కొరత విన్నాము కానీ ఇసుక కొరత ఇప్పుడే చూస్తున్నామని చంద్రబాబు అన్నారు. లేని ఇసుక కొరత సమస్యను వైసిపి నేతలే సృష్టించారని ఆయన విమర్శించారు. ఈ నెల 14న ఇసుక దీక్షతోనైనా వైసిపి ప్రభుత్వానికి కనువిప్పు కావాలనీ, మొద్దునిద్ర నుండి మేల్కొనాలనీ చంద్రబాబు అన్నారు.