CM KCR: ఎన్నికల్లో మాయమాటలు నమ్మి మోసపోతే నష్టపోతారని కావున స్పష్టమైన అవగాహనతో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసిఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో తొమ్మిదేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించారు. తెలంగాణ రాక ముందు దారుణ పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి చేరిందని అన్నారు. రైతులకు కరెంట్ కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి అప్పుడు ఉండేదని, ఇవేళ తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆరు నెలల్లో లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయని తెలిపారు. ప్రాజెక్టులు, చెక్ డ్యామ్ లతో భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు. వీరభద్ర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఎల్కతుర్తి లో బస్టాండ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తామని, శనిగరం ప్రాజెక్టుకు మరమ్మతులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తెలివిగా ఆలోచించాలన్నారు. కొన్ని పార్టీలు వచ్చి మాయమాటలు చెపుతాయని హెచ్చరించారు. ఒక్క అవకాశం ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ అడుగుతోందనీ, పది సార్లు అవకాశాలు పొందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అంధకారం చేసిందని విమర్శించారు.
గతంలో రాష్ట్రం నుండి లక్షలాదిగా ప్రజలు వలసలు వెళ్లే వారని అన్నారు. సమస్యల పరిష్కారానికి కొన్ని నెలల పాటు మేధోమథనం చేశామన్నారు. అందరి సహకారంతో రాష్ట్రాన్ని ఎన్నో అంశాల్లో నంబర్ వన్ గా నిలిపామని అన్నారు కేసిఆర్. మిషన్ భరీగథ లాంటి పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఆడబిడ్డ బిందె పట్టుకుని రోడ్డు మీద నిలబడే పరిస్థితికి ముగింపు పలికామని అన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్ల మనకు ఎవరూ సాటి రారని అన్నారు.
రైతు బంధుతో రాష్ట్ర వ్యవసాయ విధానమే మారిపోయిందన్నారు. మరో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయనున్న మేనిఫెస్టోలోని అంశాలను వివరించారు. ఓటు అనేది మన తలరాతను మారుస్తుందన్నారు. రాయి ఏంటో, రత్నమేదో గుర్తించి ఓటు వేయాలని, స్పష్టమైన అవగాహన తో ఓటు వేస్తే ప్రజలు గెలుస్తారని అన్నారు. 95 నుండి 105 సీట్లు గెలవడానికి హుస్నాబాద్ సభ నాంది కావాలని కేసిఆర్ పిలుపునిచ్చారు.
BRS Manifesto: తెలంగాణలో కేసిఆర్ ఫించన్ల పెంపు హామీలో జగన్ మార్క్