రేషన్ డీలర్ల కమీషన్ పెంపు: మంత్రి పుల్లారావు

అమరావతి, జనవరి 12: రాష్ట్రంలోని రేషన్ డీలర్‌లు అందరికీ అన్ని నిత్యావసర వస్తువులకు క్వింటాలుకు వంద రూపాయల చొప్పున కమీషన్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి  పత్తిపాటి పుల్లారావు చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం బియ్యం కేజీకి 70 పైసలు కమీషన్‌గా ‌ఇస్తున్నామని, దాన్ని రూపాయికి పెంచామనీ చెప్పారు. అదే మాదిరిగా రాగులు, జొన్నలు, కందిపప్పు, పంచదార అన్నింటికి క్వింటాల్‌కు వంద రూపాయలు కమీషన్‌గా డీలర్‌లకు చెల్లించనున్నట్లు ఆయన చెప్పారు.

ఈ ఏడాది జనవరి నుండి సంతృప్తి శాతం 85శాతం కల్గి ఉన్న డీలర్‌లకు రెండు వేల చొప్పున ప్రోత్సాహక బహుమతి కూడా ఇవ్వనున్నట్లు పుల్లారావు తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే డీలర్‌లకు రెండు సార్లు కమీషన్ ‌పెంచామని ఆయన అన్నారు. కార్డుదారులకు సక్రమంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి ప్రోత్సాహక బహుమతులు అందుకునేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.