సీఎం గారి శాపనార్థాలు

న్యూఢిల్లీ: నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీచేస్తారని భావించిన ఢిల్లీ సీఎం కారాలు మిరియాలు నూరుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఒంటరిపోటీకి కాంగ్రెస్ మొగ్గు చూపింది. దాంతో కేజ్రీవాల్ మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పొగరుబోతుదని, వాళ్ల అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని శాపనార్థాలు పెట్టారు. ఢిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాము ఎలాగోలా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించామని, కానీ వాళ్లు అర్థం చేసుకోలేదని అన్నారు. ఢిల్లీ లోక్ సభ ఎన్నికల్లో ఆప్ తో పొత్తుపై తమ పార్టీలో ఏకాభిప్రాయం లేదని ఇటీవల షీలా దీక్షిత్ ప్రకటించారు.

ఇది కేజ్రీవాల్ ఆగ్రహానికి కారణమైంది. ఢిల్లీ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతారని అన్నారు. మైనారిటీలు ఎక్కువగా ఉండే ముస్తఫాబాద్ లో.. ఓట్లు కాంగ్రెస్, ఆప్ మధ్య చీలిపోకుండా చూడాలని ప్రజలను కోరారు. తమ పార్టీ మాత్రమే బీజేపీని ఓడించగలదని చెప్పారు. ఒకవైపు కాంగ్రెస్ ఢిల్లీ విభాగం పొత్తు వద్దని చెబుతోంది. కానీ ఇప్పటికీ రెండు పార్టీల మధ్య పొత్తుకు అవకాశాలు లేకపోలేవని అంటున్నారు. రెండు ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలితే బీజేపీకి లబ్ధి చేకూరుతుంది. అందుకే పొత్తుయత్నాలు ఇంకా కొనసాగిస్తున్నారు.