ఆ ప్రజాప్రతినిధికి కరోనా పాజిటివ్ నిర్ధారణ..! నేతలు,అధికారుల్లో ఆందోళన..!!

 

ఆయనో ఒ ఫైర్ బ్రాండ్ నాయకుడు. వైసీపీ గాలిలోనూ టీడీపీ ఎమ్మెల్యేగా నెగ్గారు. ఇటీవల అధికార పార్టీకి జై కొట్టారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ వెంట నడుస్తానని ప్రకటించారు. వైసీపీ నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించారు. నాయకుడిగా సొంత క్యాడర్ ఉన్న నేత, ఎప్పుడు అనుచరవర్గం ఆయన వెన్నంటి ఉంటుంది. ఆయన ఎవరో స్పష్టంగా అర్థం అయి ఉంటుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.

కరోనా విజృంభణ ప్రారంభం అయిన నాటి నుండి సాామాన్యులను మొదలు కొని ఎంతో మంది ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు, ప్రముఖులు, సెలబ్రిటీలు దాని బారిన పడ్డారు. నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎక్కువ శాతం మంచి చికిత్సల అనంతరం కోలుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే ఆయనకు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకపోవడంతో 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉంటున్నట్లు తెలిపారు. అయితే ఇటీవల వంశీ పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయన వెంట పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల, గ్రామ స్థాయి నాయకులు ఆయనతో దగ్గరగా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.

ఇప్పుడు ఎమ్మెల్యే వంశీకి ఎటువంటి లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, అదికారులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారుట. కొందరు ముందు జాగ్రత్త చర్యగా హోంక్వారంటైన్ అవుతుండగా మరి కొందరు ఎటువంటి లక్షణాలు లేకున్నా కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని భావిస్తున్నారుట. వంశీకి ఎలాంటి లక్షణాలు లేవనీ, పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. నాలుగైదు రోజులుగా ఆయనను కలిసి వారంతా కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.