కేంద్రం ఎన్ని హామీలు ఇచ్చింది?

విజయవాడ: సీఎం జగన్ కు ఢిల్లీలో ఓ ఎంపీకి ఇచ్చిన విలువ కూడా ఇవ్వడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చెబుతున్న సీఎం జగన్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని డిమాండ్లకు అంగీకారం తెలిపిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పర్యటన వివరాలు గోప్యంగా ఉంచడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన వారవుతారని అన్నారు. ఢిల్లీ పర్యటన వివరాలు చెప్పకుండా టూర్ ఫలప్రదం ఎలా అయ్యిందని ఎంపీ విజయసాయి రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదాపై జగన్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, విభజన చట్టంలో హామీలు, వెనకబడ్డ జిల్లాలకు నిధులుపై కేంద్ర హోంమంత్రిని జగన్ కోరారని అయితే, అమిత్ షా ఏపీకి ఏం ఇస్తామని హామీ ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పటివరకు విభజన సమస్యలు ఓ దశకు రాలేదన్నారు. సీఎం అఖిలపక్ష భేటీ నిర్వహించి ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించాలని రామకృష్ణ చెప్పారు.