సైబర్ క్రైంలో షర్మిళ కేసు నమోదు

హైదరాబాద్, జనవరి14: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిళ ఫిర్యాదుపైన సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చట్ట పరంగా చర్యలు చేపట్టాలంటూ సోమవారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌కు వైసిపి నాయకులు,తన భర్త అనీల్ కుమార్‌తో కలసి ఆమె  ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అదనపు డిసిపి రఘువీర్ నేత‌ృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
కమిషనర్‌కు ఫేస్‌బుక్, వాట్సప్, వెబ్ సైట్లు, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో తనపై, తన కుటుంబ సభ్యులపైన పోస్టింగుల స్క్రీన్ షాట్లను జోడించి ఫిర్యాదులో ఆమె అందజేశారు.
తెలుగుదేశంపార్టీ నేతలు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.
ఎన్నికల సమయంలోనే కావాలని తన క్యారెక్టర్‌ గురించి అవమానించే విధంగా పోస్టులు పెడుతున్నారని ఆమె చెప్పారు.
తెలుగు సినిమా హీరో ప్రభాస్‌తో తనకు ఎటువంటి పరిచయం లేదని ఆమె స్పష్టం చేశారు.

షర్మిళ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నస్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిళపై సోషల్‌మీడియా ప్రచారానికి టీడీపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత ఆరోపణలను ప్రోత్సహించరని ఆయన అన్నారు. వ్యక్తిగత ఆరోపణలు ఏ పార్టీ వాళ్లు చేసినా ఖండించాల్సిందేనని ఆయన చెప్పారు. జగన్‌ను రాజకీయంగా విమర్శించాం గానీ, షర్మిళను ఏనాడూ ప్రస్తావించలేదనీ ఆయన పేర్కొన్నారు.