జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంటోందా..?

పూరి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ఇడియట్ సినిమాలో రవితేజ ఓ సీన్ లో ‘మనదే.. ఇదంతా’ అంటాడు. కానీ.. అక్కడ సీన్ రివర్స్ అయిపోతుంది. ప్రస్తుతం ఇలానే ఉంది గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో దుబ్బాక విజయం, టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత.. బీజేపీకి బాగా కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ.. పార్టీ నాయకుల మాటల తీరు పార్టీ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపించేలా ఉంది. గత రెండు మూడు రోజులుగా బీజేపీ ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకుల మాటలు వింటే.. హైదరాబాద్ లో సెటిలర్లు.. ముఖ్యంగా వైఎస్ అభిమానులు, రాయలసీమ వాసులపై ఆ ఎఫెక్ట్ ఉందని తెలుస్తోంది.

does bjp making self goal in ghmc elections
does bjp making self goal in ghmc elections

బీజేపీ నాయకుల మాటలు వారికి కోపం తెప్పించాయా..?

దుబ్బాకలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన రఘునందన్ రావు గ్రేటర్ ప్రచారంలో.. ‘గతంలో ఒకాయన ఇట్లాగే మాట్లాడి అట్లాగే పోయాడు’ అని సెటైరికల్ డైలాగ్ వేశారు. ఇది మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారని అంటున్నారు. తర్వాత ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. గెలుపు కోసం చేయాల్సింది చేయకుండా రఘునందన్ మాట్లాడిన మాటలు సెటిలర్లు, రాయలసీమ వాసులు, వైఎస్ అభిమానులకు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. రెడ్డి వర్గం వాట్సాప్ గ్రూపుల్లో టీఆర్ఎస్ కు ఓటేయాలని ప్రచారం జరగడమే ఇందుకు కారణం. ఇటివల సీఎం జగన్ కు బీజేపీకి మధ్య స్నేహం పెరగడంతో బీజేపీ వైపు ఉండాలని మొదట్లో భావించారని తెలుస్తోంది. కానీ.. బీజేపీ వ్యాఖ్యలతో ఇప్పుడు టీఆర్ఎస్ వైపు నిలబడాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.

బీజేపీ-జనసేన దోస్తీ.. ఏం చేస్తుందో?

మరోవైపు.. ఏపీలో పవన్ కల్యాణ్ తో బీజేపీ దోస్తీ కూడా గ్రేటర్ లో ఎఫెక్ట్ చూపేలా ఉందని అంటున్నారు. జగన్ అంటే పడని పవన్ తో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేయడం కూడా బీజేపీకి ప్రతికూలం కానుందని అంటున్నారు. జగన్ – బీజేపీ దోస్తీ కారణంగా మొదట బీజేపీకి సపోర్ట్ చేద్దామని అనుకున్నా.. ఇప్పుడా పరిస్థితులు లేవని తెలుస్తోంది. ఓవైపు రఘునందన్ వ్యాఖ్యలు, ఓవైపు బీజేపీ – జనసేన తీరు వారి గెలుపు గుర్రానికి కళ్లెం వేస్తోందని అంటున్నారు. మరి.. సనత్‌నగర్, మలక్‌పేట, శేరిలింగంపల్లి, అంబర్‌పేట కూకట్‌పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, ఉప్పల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న సీమవాసులు ఏం చేస్తారో చూడాలి.