జగన్ ‘బిసి డిక్లరేషన్’…లక్ష్యం చేధించిందా?

వైసిపి అధినేత జగన్ ప్రకటించిన బిసి డిక్లరేషన్ ఎపి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికలు అంతకంతకు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటు బ్యాంకులను కొల్లగొట్టేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఎత్తులకుపైఎత్తులు నేపథ్యంలో వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రకటించిన బిసి డిక్లరేషన్ సహజంగానే అన్ని రాజకీయ పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. తమ పార్టీ అధినేత జగన్ ప్రకటించిన బిసి డిక్లరేషన్ పై వైసిపి శ్రేణుల్లో పూర్తి సంతృప్తి వ్యక్తం అవుతుండగా అధికార పార్టీ టిడిపి మాత్రం పెదవి విరిచింది. తాము ఇప్పటికే బిసిలకు అంతకుమించిన అభివృద్ది పథకాలు అమలు చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు జగన్ పై ఎదురుదాడికి దిగారు. అయితే మిగతా రాజకీయ పార్టీలు మాత్రం ఈ విషయమై ఆచితూచి స్పందిస్తున్నాయి. అయితే మొత్తం మీద చూస్తే బిసి డిక్లరేషన్ ప్రకటన విషయంలో జగన్ తాను కోరుకున్న మైలేజీ సాధించినట్లే కనిపిస్తోంది.

ఆదివారం ఏలూరులో జరిగిన బిసి గర్జన సభలో జగన్ బిసి డిక్లరేషన్ పేరిట వారిపై వరాల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలో వస్తే బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం వచ్చే ఐదేళ్లలో రూ.75,000 కోట్లు వ్యయం చేస్తామని, ప్రతిఏటా రూ.15,000 కోట్లకు తక్కువ కాకుండా ఖర్చు చేస్తామని జగన్ ఈ డిక్లరేషన్ లో పేర్కొన్నారు. అలాగే బడ్జెట్‌లో మూడో వంతు నిధులను బీసీల అభివృద్ధికే కేటాయిస్తామని, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత తీసుకొస్తామని జగన్ హామీ ఇవ్వడం జరిగింది. దీంతో జగన్ ప్రకటించిన బిసి డిక్లరేషన్ బిసిలతో పాటు అన్ని రాజకీయ పార్టీల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు మొదటి నుంచి జగన్ బిసి గర్జన సభను, ఆయన ప్రకటించే బిసి డిక్లరేషన్ ను తేలికగా తీసుకొన్న అధికార పార్టీ టిడిపి ఆ డిక్లరేషన్… అందులోని అంశాలు…తదనంతర స్పందన చూశాక పునరాలోచనలో పడిన పరిస్థితి కనిపిస్తోంది.

వైసిపి అధినేత జగన్ తాను బిసిల అభివృద్దికి కట్టుబడి ఉన్నట్లు వారిలో నమ్మకం కలిగించేందుకు చేసిన ప్రత్యేక కసరత్తులు విజయవంతమైనట్లు ఈ సభ జరిగిన తీరు…తద్వారా లభించిన మైలేజీ తెలియజేస్తోంది. ఇందులోని పథకాలను తాను తప్పనిసరిగా నెరవేరుస్తానని నమ్మకం కలిటించేందుకు జగన్ అనుసరించిన వ్యూహం…ఆయనని తేలిగ్గా తీసుకున్న అధికారపార్టీ టిడిపిని సైతం విసమ్మయానికి లోను చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు నాట బిసి నేతగా అత్యంత ప్రసిద్ది పొందిన ఆర్.కృష్ణయ్యని జగన్ ఈ సభకు రప్పించడంతో ఆయనకు అమితమైన ప్రాధాన్యతని ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచాయి. అలాగే ఆర్.కృష్ణయ్య కూడా బిసిల అభివృద్దికి వైసిపి కట్టుబడి ఉంటుందని ఘంటాపథంగా చాటడంతో పాటు టిడిపిపై విరుచుకుపడిన తీరు ఆ పార్టీకి ఊహించని షాకేనని చెప్పాలి.

ఏదేమైనా ఈ బిసి గర్జన సభ-బిసి డిక్లరేషన్ ప్రకటన ద్వారా తాను ఆశించిన ప్రయోజనాన్ని పొందడంలో జగన్ కృతార్థులయ్యారని ఆయన ప్రత్యర్థులు సైతం ఒప్పుకోకతప్పదు. అయితే అదే సమయంలో ఈ సభ వైసిపి అధినేత జగన్ అనుసరించబోయే ఓటు బ్యాంకు రాజకీయాల వ్యూహాలను కొన్నింటిని బహిర్గతపరిచిందనే చెప్పుకోవాలి. అవి…టిడిపికి పెట్టని కోటలా ఉన్న బిసిల ఆదరణను కొల్లగొట్టడం…అందుకోసం అవసరమైతే కాపుల నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు సంసిద్దమవడం…వీటికి జగన్ ముందుగానే ప్రిపేర్ అయ్యాడనే ఈ సభ తేటతెల్లం చేస్తోంది.

జయహో బిసిల కార్యక్రమం పేరిట టిడిపి తమ పార్టీ పట్ల వారి ఆదరణను కాపాడుకునేందుకు ప్రత్యేక సభ నిర్వహించగా…వారిని తమవైపు తిప్పుకునేందుకు వైసిపి ఈ బిసి గర్జన సభ నిర్వహించింది. పైగా బిసిలకు సంబంధించి అధికార,ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన ఈ రెండు ముఖ్యమైన సభలు గోదావరి జిల్లాల కేంద్రాల్లోనే జరగడం మరో విశేషం. కారణం ఆ రెండు జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న కాపుల కంటే ఎక్కువగా బిసిలు మొత్తం మీద 50 శాతం ఉండటమే. అందుకే టిడిపి జవరి 27న జయహో బిసిల పేరుతో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సభ నిర్వహించి బిసిలపై వరాల జల్లు కురిపిస్తే, పక్షం రోజుల వ్యవధిలో జగన్ బిసి గర్జన పేరుతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన సభలో వారిని ఏకంగా వరాల వర్షంలో తడిపేశారు. దీంతో ఈ రెండు పార్టీలు తాము గెలుపు గుర్రం ఎక్కేందుకు బిసిల ఆదరణే అత్యంత కీలకంగా భావిస్తున్నట్లు చాటి చెప్పినట్లయింది.

అయితే బిసిల విషయంలో ప్రతిపక్ష పార్టీ వైసిపి అధినేత జగన్ వైఖరి గమనిస్తే కొన్ని అంశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అది ఎలాగైనా బిసిల ఆదరణ పొందాలనేది జగన్ తాపత్రయంగా తేటతెల్లమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ఓటు బ్యాంకుల విషయానికొస్తే ప్రధమ స్థానంలో ఉండేది బిసిలది కాగా ఆ తరువాత స్థానంలో ఉండేది కాపులు. అయితే టిడిపి ఈ ఓటు బ్యాంకుల విషయంలో రెండు కళ్ల సిద్దాంతం పాటిస్తున్న పరిస్థితులు కనిపిస్తుండగా…వైసిపి అధినేత జగన్ మాత్రం బిసిల ఆదరణకే బహిరంగంగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతోంది. అందుకే బిసిల మనసు గెలుచుకునేందుకు కాపుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనేందుకు సైతం జగన్ సిద్దమైనట్లు కనిపిస్తున్నారు.

అందుకు నిదర్శనంగా కాపుల రిజర్వేషన్ విషయంలో జగన్ బహిరంగంగా చేసిన పరుష వ్యాఖ్యలు ఆ పార్టీ కాపు నేతలతో సహా మిగతా నేతలను విస్మయానికి గురిచేయగా అధికారపార్టీ టిడిపి,జనసేన జగన్ వైఖరి తమకు మేలుకరంగా పరిణమిస్తుందని భావించాయి. ఆ తరువాత కూడా వైసిపిలోని కాపు నేతల పదవుల్లో స్థాన భ్రంశం, అలాగే దివంగత కాపు నేత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా విషయంలో జగన్ మొండి వైఖరి తదిదర అంశాలన్నీ కాపుల మనసు నొప్పిస్తాయని తెలిసీ చేసినవే అనుకోవాలి. అదే నిజమైతే జగన్ కాపుల విషయంలో ఒక స్పష్టమైన వైఖరి తీసుకున్నారని భావించాలి. దాన్నిబట్టి తాను ఎంత చేసినా, ఏమి చెప్పినా మెజారిటీ కాపులు తనకు ఓట్లు వేయరని జగన్ ఫిక్స్ అయ్యారా?…లేక గత ఎన్నికల్లో తన ఓటమికి కారణం కాపులే కాబట్టి వారిపై ప్రతికూల ధోరణితో ఉన్నారా?…అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

కాపుల పట్ల జగన్ వైఖరి సర్వత్రా చర్చనీయాంశం అయిన నేపథ్యంలో బిసిల పట్ల జగన్ చూపిస్తున్న ఆదరణ వీరివురి విషయంలో ఆయన వైఖరిని తేటతెల్లం చేస్తున్నట్లు తాజాగా జరిగిన బిసిల గర్జన, అందులో జగన్ ప్రకటించిన బిసిల డిక్లరేషన్ స్పష్టం చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు ఇటీవల వరుసగా ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలతో టిడిపిలో ఉత్సాహం వెల్లివిరుస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీ వైసిపి శ్రేణులు ఈ పరిణామాలతో కొంత డీలా పడినట్లు కనిపించింది. అయితే తాజాగా అనూహ్యంగా జగన్ ప్రకటించిన బిసి డిక్లరేషన్ కు ఆయా వర్గాల నుంచి మంచి స్పందన రావడం…టిడిపి నేతల వరుస చేరికలతో ఉత్సాహంగా వైసిపిలో మరింత జోష్ నింపింది. ఏదిఏమైనా బిసిల అండ తమకే ఉంటుందన్న ధీమాతో ఉన్న టిడిపి ఈ తాజా పరిణామాలతో పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. అయితే ఇలా బిసిల ఆదరణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ టిడిపి, ప్రధాన ప్రతిపక్షం వైసిపి చేస్తున్న ప్రయత్నాలు ఎవరికి ప్రయోజనం చేకూరుస్తాయనేది వచ్చే ఎన్నికలే తేల్చి చెప్పనున్నాయి.