దుబ్బాకలో బీజేపీ అభ్యర్ధికి చుక్కలు చూపిస్తున్న పోలీసులు..!!

 

(సిద్దిపేట నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ప్రచార పర్వం హోరాహోరీగా సాగుతోంది. అధికార టీఆర్ఎస్ తరుపున దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత, కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి, బీజెపీ తరపున రఘునందనరావు బరిలో ఉన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి తరపున మంత్రి హరీష్ రావు అన్నీ తానే అయి ప్రచారం నిర్వహిస్తున్నారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఎవరికి వారు విజయమే లక్ష్యంగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.

ఒక వైపు అభ్యర్థుల ప్రచారం జరుగుతుండగానే బీజెపి అభ్యర్థి రఘునందన రావుకు అధికార టిఆర్ఎస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రఘునందన రావు నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లతో సహా మొత్తం ఎనిమిది ప్రదేశాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 18 లక్షల 67వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న అభ్యర్థి రఘునందనరావు బంధువుల ఇళ్లవద్దకు చేరుకున్నారు.పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తూ రఘునందన రావు నిరసనకు దిగారు. పార్టీ కార్యకర్తలు అధికారులపై వాదనకు దిగారు.

పది రోజుల క్రితం హైదరాబాద్ నుండి తరలిస్తున్నట్లుగా భావిస్తున్న రూ.40 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 3వ తేదీన దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్నది. పదవ తేదీ ఓట్లను లెక్కించనున్నారు.