టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు

అమరావతి: తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు అయ్యింది. జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి టిడిపి ఎమ్మెల్యేలు, నాయకులపై కేసుల పరంపర కొనసాగుతోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్న తరుణంలో తాజాగా వంశీపై కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది.

ఎన్నికల సమయంలో పేదలకు నకిలీ ఇళ్లపట్టాలు పంపిణీ చేశారన్న ఆభియోగంతో వల్లభనేని వంశీ, ఆయన అనుచరులపై హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడం ఆ పార్టీ నేతలను ఆందోళన కల్గిస్తోంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చినట్లు బాపులపాడు తహశీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు.

గతంలో అనేక అభియోగాలు ఉన్నా, ఇబ్బంది లేకుండా కొనసాగుతున్న పలువురు టిడిపి నేతలకు నేడు ఉచ్చు బిగుసుకొంటోంది.

నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా టిడిపి ఎమ్మెల్యేలు, నేతలపై కేసులు నమోదు అవుతున్నాయి. మాజీ శాసనసభాపతి, దివంగత కోడెల శివప్రసాద్, ఆయన కుమారుడు, కుమార్తె, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వైసిపి నుండి టిడిపిలో చేరిన కలమట వెంకట రమణ, మాజీ విప్ కూన రవికుమార్‌, టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి తదితరులపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.

కేసుల కారణంగా మనస్థాపంతో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.