సర్వే సస్పెన్షన్

హైదరాబాదు, జనవరి 6:  గాంధీ భవన్‌లో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న సమీక్షా సమావేశం గందరగోళంగా మారి మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ సస్పెన్షన్‌కు దారి తీసింది. సమీక్షా సమావేశాల్లో రెండవ రోజైన ఆదివారం మల్కాజిగిరి, సికింద్రాబాద్, మెదక్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్, ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు.

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష జరుపుతున్న సమయంలో మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ, పార్టీ ఓటమికి కారకులైన వారే సమీక్షలు జరుపుతున్నారనీ, రౌడీలను పక్కన కూర్చొబెట్టుకుంటున్నారనీ విమర్శించడం  నాయకుల మధ్య ఘర్షణకు దారి తీసింది. పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు రవిపై సర్వే సత్యనారాయణ వాటర్ బాటిల్ విసిరారు. ఆ తర్వాత నాయకత్వంపై ఆరోపణలు చేస్తూ సమావేశం నుండి వెళ్లిపోయారు.

అనంతరం సర్వే సత్యనారాయణ మీడియా ముందు మాట్లాడుతూ, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు.  తూతూ మంత్రంగా సమీక్షలు నిర్వహిస్తున్నారనీ, పార్టీని కాపాడాలంటే కుంతియా, ఉత్తమ్‌లపై అధిష్టానం చర్యలు తీసుకోవాలనీ సర్వే అన్నారు.

సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలను పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. కుంతియా, ఉత్తమ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను  సర్వే సత్యనారాయణను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.