సీటుపై స్పష్టత లేదు: పార్టీ మారే యోచనలో ఎమ్మెల్యే చరిత


అమరావతి: ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఈ చేరికలు తమ పార్టీని బలోపేతం చేస్తాయని అధిష్టానం భావిస్తుండగా.. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలు మాత్రం అసంతృప్తికి గురవుతున్నారు. పార్టీ కోసం చాలా కాలంగా పనిచేస్తున్న తమను పక్కన పెట్టి.. తాజాగా చేరిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంతో తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.

కర్నూలు జిల్లా పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరిత, ఆమె భర్త గౌరు వెంకట్ రెడ్డి కూడా అధిష్టానం తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరపున పాణ్యం నుంచి చరిత ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, ఆ తర్వాత పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు.

ఈ క్రమంలో తమకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిందని గౌరు దంపతులు భావిస్తున్నట్లు సమాచారం. పార్టీలో కాటసాని రాంభూపాల్ రెడ్డికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకే పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయని ఊహానాలు వినిపిస్తుండటంతో గౌరు దంపతులు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాణ్యం టికెట్ గౌరు దంపతులకు కేటాయించే విషయంలో స్పష్టత నివ్వకపోవడం కూడా వారి అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. పార్టీ మారడంపై త్వరలోనే ఈ దంపతులు నిర్ణయం తీసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ వైసీపీని వీడితే అధికార టీడీపీలోనే చేరతారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.