శశికళ పంజా విసురుతుందా..? తలొగ్గుతుందా..??

దేశమంతా ఒక తీరుతో ఉంటే తమిళనాడు ఒక తీరులో ఉంటుంది. భాష, కట్టు, సినిమా, రాజకీయం, వ్యక్తి ఆరాధన.. ఇలా చాలా అంశాలు ఆ రాష్ట్రంలో ఉంటాయి. ఇందులో రాజకీయాలు మరింత పదునుగా ఉంటాయి. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే.. ఈసారి జరిగే ఎన్నికలకు రెండు స్పెషల్స్ ఉన్నాయి. రాజకీయ ఉద్దండులు కరుణానిధి, జయలలిత లేకుండా జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఒకటైతే.., సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందే జయలలిత నిచ్చెలిగా పేరు తెచ్చుకున్న శశికళ జైలు నుంచి విడుదల కావడం. ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తున్న తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు ఖాయమేనా..!

how sasikala face tamil nadu politics
how sasikala face tamil nadu politics

శశికళ లక్ష్యం అదొక్కటే..

జయలలిత నిచ్చెలిగా శశికళ ఆమె మరణం తర్వాత సీఎం కావాలని ప్రయత్నించారు. కానీ.. అనూహ్య పరిణామాల మధ్య శశికళ జైలు పాలయ్యారు. ఈనేపథ్యంలో జయలలిత సీఎంగా నియమించిన పన్నీర్ సెల్వంను కాదని.. తన నమ్మినబంటు పళనిస్వామిని పీఠంపై కూర్చోబెట్టారు. నాలుగేళ్లుగా ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులోనే ఉంటున్నారు.. తమిళ రాజకీయాలపై తెలుసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు సత్ప్రవర్తన కింద ఆమె ముందుగానే విడుదలవుతున్నారని వార్తలు వస్తున్నాయి. పైగా 10 కోట్ల 10 లక్షల జరిమానా కట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఎన్నికల ముందే కాస్త త్వరగా వచ్చి అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెడతారంటున్నారు.

తమిళనాడులో రాజకీయ సమీకరాణాలు మారినట్టేనా..

తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోవడమే ప్రస్తుతం శశికళ లక్ష్యమనేది తెలిసిన విషయమే. అయితే.. మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆమెకు ఇది సాధ్యమేనా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. డీఎంకే నుంచి స్టాలిన్ తో గట్టి పోటీ ఖయమే. మరోవైపై సినిమా స్టార్లు రజినీకాంత్, కమల్ హాసన్ పార్టీలు పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. అసలే సినిమా ప్రభావం ఎక్కువగా ఉండే తమిళ రాజకీయాల్లో వీరిద్దరి రాకతో సమీకరణాలు మారడమూ ఖాయమే. జయలలిత లేని అన్నాడీఎంకేకు శశికళను చూసి ఓట్లు పడటమూ అనుమానమే. ఈ నేపథ్యంలో శశికళ ఆశలు ఏమేరకు నెరవేరుతాయో చూడాలి. ఏదేమైనా దేశ రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాలు వేరని చెప్పాల్సిందే.