రాష్ట్రలో రామతీర్ధం అంశం రాజకీయంగా రెండు పార్టీల మధ్య రావణకాష్టంలా రగులుతోంది. ఏకంగా శ్రీరాముడి విగ్రహం తల వేరు చేయడం తీవ్ర వివాదాస్పదం అయింది. దీంతో వైసీపీ, టీడీపీ ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాకు వెళ్లిన విజయసాయి రెడ్డి, చంద్రబాబు పర్యటనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. దీంతో ఆమధ్య రాష్ట్రంలో జరిగిన హిందూ దేవాలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం ఘటనలు కాస్తంత చల్లబడి.. మళ్లీ మొదలయ్యాయి. దీంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అలజడి వాతావరణం నెలకొంది.

ఆవేశంలో వైసీపీ తప్పులు..!
విజయనగరం వెళ్లిన విజయసాయిరెడ్డి వెళ్లడంతో పరిస్థితులు వేడెక్కాయి. అక్కడికే వెళ్లిన చంద్రబాబును లారీలు అడ్డుపెట్టి అడ్డుకోవడంతో సానుభూతి వచ్చింది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి తీరు వైసీపీకి నష్టం చేకూర్చిందని చెప్పాలి. పైగా దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మాజీ ఎంపీ అశోక్ గజపతిరాజుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా వైసీపీకి ఇబ్బందిగా మారాయి. తాను మంత్రిగా ఉండగా ఇటువంటి ఘటనలు వరుసగా జరగడం.. తాను ఉండే విజయవాడలోనే సీతమ్మ వారి విగ్రహం కూడా ఒక్కరోజు తేడాలోనే ధ్వంసం కావడంతో స్వతహాగానే మంత్రి ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ నేతలు తప్పు మీద తప్పు చేసినట్టైంది. ఇలాంటి అవకాశాల కోసమే వేచి చూసే చంద్రబాబు లోలోపల సంతోషపడే ఉంటారని చెప్పాలి. దీంతో వైసీపీకి కాస్తంత డ్యామేజీ జరిగిందని చెప్పాలి.
టీడీపీ మీదకు ఎక్కుపెట్టిన బాణాలు..
రాష్ట్రంలోని దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక టీడీపీనే ఉందని నిరూపించేందుకు వైసీపీ అన్ని శక్తులనూ కూడగట్టుకుంటోంది. అందుకే వైసీపీ మీడియా, నాయకులు, సీఎం జగన్ కూడా ఈ కుట్రల వెనక టీడీపీ ఉందనే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందులో వాస్తవమెంత అనే అంశాలు పక్కనపెడితే.. కొన్ని అంశాలను పరిశీలిస్తే ఈ విగ్రహాల ధ్వంసం వెనక ఎంతోకొంత తెలుగుదేశానికి హస్తం ఉందనే చెప్పాలి. సీఎం జగన్ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ప్రతిసారీ.. లేదా ఆయన పర్యటనలు జరుగుతున్న వారం అటుఇటూగా ఏదొక సంఘటన జరగడం జరుగుతోంది. దీంతో జగన్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఘటనలు అనే అనుమానం రాకమానదు. ప్రస్తుతం రాష్ట్రమంతా ఒక యజ్ఞంలా జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రజలు, మీడియా ఫోకస్ మళ్లించేందుకు ప్రతిపక్షం చేస్తున్న కుట్ర అని వైసీపీ ఆరోపిస్తోంది. పైగా.. రీసెంట్ గా పవన్ గుడివాడ వెళ్లి మంత్రి కొడాలి నానిపై చేసిన డైలాగ్స్ హైలైట్ కావడం కూడా ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి అందరినీ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు వేసిన ప్లాన్ గానే తెలుస్తోంది. అయితే..
చంద్రబాబు అంతకు తెగిస్తారా..?
జరుగుతున్న పరిణామాల్లో టీడీపీ పాత్రపై అనుమానాలు వస్తున్నా.. చంద్రబాబు హిందూ దేవాలయాల జోలికి వెళ్తారా అనేది ఒక ప్రశ్న. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే విధంగా చంద్రబాబు ఆలోచనలు చేయొచ్చేమో కానీ.. దేవాలయాలు, హిందువుల మనోభావాల అంశాలతో ముడిపెట్టుకోగలరా..? అనే సందేహాలు వస్తున్నాయి. ఈ స్థాయి కుట్రలు గతంలో చేయనివి. ప్రస్తుతం తెలంగాణలో ఆయనపై ఓటుకు నోటు కేసు, జస్టిస్ రమణపై సుప్రీం చీఫ్ జస్టిస్ అంశాల్లో ఆయన కాస్త కంగారులో ఉన్న మాట వాస్తవమే. ఈ నేపథ్యంలో అన్ని అంశాల నుంచి ప్రజలు, వ్యవస్థల దృష్టి మరల్చేందుకే ఇటువంటి ఆలోచనలు చేస్తున్నారా అనే సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ఉన్న పరిస్థితుల్లో ఆయనకు ఈ తరహా కుట్రలు ఏమంత మంచివి కావు కూడా..!
బీజేపీ పాత్ర ఉందా..?
మరోవైపు ఆలోచిస్తే.. ఈ కుట్రలో బీజేపీ పాత్రను కూడా అనుమానించాల్సిందే. మతంపైనే నమ్మకం పెట్టుకున్న బీజేపీ అదే రీతిలో వ్యవహరించడం ఇటివల చూస్తున్నాం. బీహార్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనం. అయితే.. అయోధ్యలో శ్రీరాముడి ఆలయం నిర్మాణం చేస్తున్న బీజేపీ కూడా ఇంతకు తెగిస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. కానీ.. అవకాశాలను ఒడిసి పట్టడంలో ప్రస్తుతం బీజేపీ రాటుదేలి ఉంది. దీంతో రాష్ట్రంలో ప్రతి పార్టీ కూడా ఈ దారుణంలో భాగం పంచుకోవాల్సిందే. ప్రజల హితం కోసం కాకుండా తమ ఉనికి కాపాడుకోవడం కోసం మాత్రమే పని చేస్తున్న రోజులకు రాజకీయ పార్టీలు వచ్చేశాయి. ఇందుకు మతం, దేవుళ్లు, ప్రజలను బలి పశువులను చేయాల్సిన అవసరం లేదు.