ఎవరు పీఠం ఎక్కితే మాకేంటి..! మేము ఇంతే..! ఓటర్ల తీరు..!

 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోలింగ్ చాలా మందకొడిగా సాగుతున్నది. సెలబ్రెటీలు, ప్రమఖులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఓటర్లు ఎందుకో ఆసక్తి చూపడం లేదు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మూడు డివిజన్‌లలో ఒక్క శాతం కూడా ఓటింగ్ నమోదు కాకపోవడం గమనార్హం.  పది డివిజన్‌లలో మాత్రమే మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 40శాతంకు పైగా ఓటింగ్ నమోదు అయ్యింది. అత్యధికంగా ఖైరతాబాద్ జోన్ పరిధిలోని మహదీపట్నం సర్కిల్ గుడిమల్కాపుర్ డివిజన్‌లో మాత్రం 49.19 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ఇక్కడ 51,164 మంది ఓటర్లకు గానూ 25,168 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తరువాత స్థానంలో గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్ లో 42.94, మూసాపేట సర్కిల్ అల్లాపూర్ డివిజన్‌లో 42.74 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.

దాదాపు 30 డివిజన్‌లలో ఒంటి గంట వరకూ పది శాతం కూడా పోలింగ్ నమోదు కాకపోవడం విశేషం. కాగా చార్మినార్ జోన్ పరిధిలోని మూడు డివిజన్ లో ఒంటి గంట వరకూ ఒక్క శాతం పోలింగ్ కూడా నమోదు కాలేదు. సంతోష్‌నగర్ సర్కిల్ లోన రెయిన్‌బజారు వార్డులో 0.56, తలబ్‌చంచలమ్ వార్డులో 0.74 శాతం, అమీర్‌పేట వార్డుల 0.79 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయ్యింది. అమీర్‌పేట వార్డులో 48,268 మంది ఓటర్లకు గానూ కేవలం 379 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా తలబ్‌చంచలమ్ వార్డులో 44,969 మంది ఓటర్లకు గానూ 332 మంది, రెయిన్ బజారు వార్డులో 42,718 మంది ఓటర్లకు గానూ 240మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గత ఎన్నికల్లోనూ 50 శాతం లోపే పోలింగ్ నమోదు అయ్యింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల అధికారులు తగిన చర్యలు చేపట్టినప్పటికీ ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపడం లేదని స్పష్టం అవుతోంది.

ఓటింగ్ పెరగకపోవడానికి కారణం ఉన్నత, ధనిక వర్గాలేనా

గ్రేటర్ హైదరాబాద్‌లో పోలింగ్ పర్సెంటేజ్ పెరగకపోవడానికి ప్రధాన కారణం ఉన్నత, ధనిక వర్గాలే కారణంగా ఎక్కువ మంది పేర్కొంటున్నారు. ఒక వైపు కరోనా భయం, మరో వైపు ఎవరు అదికారంలో ఉన్న ఆ వర్గాలకు వచ్చే లాభం గానీ నష్టం గానీ లేదు. ఎవరు అధికారంలో ఉన్న వారి పనులకు ఇబ్బంది ఏమీ ఉండదు. ఆ కారణంతో వీరు ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు. దానికి తోడు వారి విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం ఇష్టం లేక. గంటల తరబడి పోలింగ్ బూత్‌ల వద్ద క్యూలైన్‌లలో బారులు తీరే ఓపికలేకపోవడం తదితర కారణాల వల్ల వీరు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారనీ ఆ కారణంగానే నగరంలో ఓటింగ్ శాతం పెరగడం లేదని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.