బీఎస్పీతో సర్దుబాటు కుదిరింది

విజయవాడ: బహుజన్ సమాజ్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మూడు లోక్ సభ స్థానాలు, 21 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఆదివారం విజయవాడలో బీఎస్పీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

తిరుపతి, బాపట్ల, చిత్తూరు లోక్‌సభ స్థానాలను పవన్ బీఎస్పీకి కేటాయించారు. ఈ మూడు లోక్ సభ స్థానాలు ఎస్‌సి రిజర్వ్‌డ్ నియాజకవర్గాలు.

అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇంకా చర్చలు పూర్తి కాలేదు. మరోసారి చర్చించి వివరాలు వెల్లడిస్తామని పవన్ అన్నారు.

మొన్న లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఏపీకి సీఎం కావాలని మమతా బెనర్జీ ఆకాంక్షిస్తే.. మాయావతిని ప్రధానమంత్రిగా చూడాలని పవన్ అన్నారు.

ఈ నేపథ్యంలో  సీట్ల సర్దుబాటుపై  పవన్‌తో చర్చించేందుకు మాయావతి బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు వీర్ సింగ్‌ను ఏపీకి పంపారు. చర్చల అనంతరం పవన్ ఈ ప్రకటన చేశారు.

మొదట పవన్ వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జట్టులో బీఎస్పీ కూడా చేరింది. వామపక్ష నేతలతోఇప్పటికే పలుమార్లు సీట్ల సర్దుబాటుపై చర్చించినప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.