మల్కాజ్‌గిరిలో జనసేన పోటీ

విజయవాడ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో సైతం పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. తమ పార్టీ తరపున పోటీ చేయనున్న మొట్ట మొదటి అభ్యర్థిని పవన్ ప్రకటించారు. మల్కాజ్‌గిరి జనసేన లోక్‌సభ అభ్యర్థిగా వ్యాపారవేత్త, పార్టీ వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు బొంగనూరి మహేందర్‌ రెడ్డిని బరిలో దించుతున్నట్టు పవన్‌ వెల్లడించారు. శనివారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మహేందర్‌ రెడ్డి అభ్యర్థిత్వాన్నిఖరారు చేశారు.

సమాజానికి సేవ చేయాలన్న తపనతో కోట్లాది రూపాయల వ్యాపారాలను వదులుకొని తనతోనే మహేందర్‌ రెడ్డి ఉన్నారని పవన్‌ తెలిపారు. ప్రజా రాజ్యం పార్టీ స్థాపించక ముందు నుంచి కలిసి పని చేశామని పవన్ పేర్కొన్నారు.

మెదక్‌ పార్లమెంట్‌ స్థానానికి ఆయనను పీఆర్పీ అభ్యర్థిగా ఎంపికచేసినా ట్రాఫిక్‌లో చిక్కుకొని నామినేషన్‌ వేయలేకపోయారని పవన్ గుర్తుచేసుకున్నారు. ఆ తప్పును సరిదిద్దుకుంటూ ఆయనను మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ స్థానం నుంచి అభ్యర్థిగా బరిలో దించుతున్నట్టు పవన్‌ ప్రకటించారు.

మహేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు, జన సైనికులకు ఈ సందర్భంగా పవన్ పిలుపునిచ్చారు.