అమరావతి, జనవరి 3 : రానున్స సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందనీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పస్టం చేశారు. గురువారం ఈమేరకు పార్టీ కార్యాలయం ఒక అధికారిక ప్రకటనల విడుదల చేసింది. అధికార ప్రతిపక్ష పార్టీలు చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దని పవన్కళ్యాణ్ పార్టీ శ్రేణులకి స్పష్టం చేశారు. వామపక్షాలు మినహా అధికారపక్షంతోగానీ, ప్రతిపక్షంతోగానీ కలిసే పరిస్థితులు, అవకాశాలు లేవని తేల్చి చెప్పారు.
“జనసేన పార్టీ వాళ్లతో కలుస్తుందీ, వీళ్లతో కలుస్తుందని ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీ స్ధానాలను కేటాయింపు చేసిందని రకరకాల ప్రచారాలతో జనసేన శ్రేణుల్ని గందరగోళానికి గురి చేసి స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతోందన్నారు.
ఇవన్నీ మనల్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలే. అధికారపక్ష నాయకులు సైతం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం కూడా గందరగోళానికి గురి చేసేందుకేనన్నారు. 2014లో తెలుగు ప్రజల సుస్థిరత కోసం కొన్ని పార్టీలకి మద్దతు ఇచ్చామనీ, ఇప్పుడు సమతుల్యత కోసం జనసేన పార్టీ 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. 25 సంవత్సరాలపాటు యువత భవిష్యత్తుకి అండగా ఉండాలన్న లక్ష్యంతో కొత్త తరం నాయకత్వం వైపు చూస్తున్నామని తెలిపారు. అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులతో పాటు 175 స్థానాల్లో ఎక్కువశాతం యువతకే అవకాశం ఇవ్వబోతున్నారు. మహిళలు, యువతతో పాటు కొత్తతరం బయటికి రావాలినీ, చట్టసభల్లో అడుగుపెట్టాలన్నారు. ఇందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తున్నామని తెలిపారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకి చెందిన జిల్లా స్థాయి నాయకులు గానీ, రాష్ట్ర స్థాయి నాయకులు గానీ జనసేనతో మేం మాట్లాడేశాం, స్థానాలు ఇచ్చేశాం అని చేసే ప్రచారాలు నమ్మవద్దునీ, మనం ఒంటరిగా పోటీ చేస్తున్నామన్నారు. భావితరాల భవిష్యత్తుకి కట్టుబడి ఉన్నామనీ, దయచేసి అధికార, ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మవద్దని తెలిపారు. ఇలాంటి వార్తల్ని గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో ముక్తకంఠంతో ఖండించాల”ని పార్టీ శ్రేణులకి పిలుపునిచ్చారు. జనసేన పార్టీ స్థాపించింది ఒక ఎన్నికల కోసం కాదు భావి తరాల భవిష్యత్తు కోసమని వన్కళ్యాణ్ స్పష్టం చేశారు.