సీఎం కెసీఆర్ ప్రాజెక్టుల సందర్శన

హైదరాబాదు, డిసెంబర్ 30: రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన  కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు ముహూర్తం నిర్ణయించారు. జనవరి 1 నుండి ప్రాజెక్టుల సందర్శనకు ఆయన బయలు దేరుతున్నారు. తొలుత డిసెంబర్ 31న రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాదద్ రెడ్డి ఆధ్వర్యంలో రిటైర్డ్ ఇంజనీర్‌ల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపు హౌస్‌ల నిర్మాణ పనులను పరిశీలిస్తుంది. అదే రోజు సాయంత్రం సీఎం కెసీఆర్‌కు ప్రాజెక్టు  పనుల పురోగతి వివరిస్తారు. జనవరి 1న కెసీఆర్ బేగంపేట ఎయిర్ పోర్టు నుండి హెలికాఫ్టర్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల సందర్శనకు బయలు దేరతారు, ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలను, పంప్ హౌజుల నిర్మాణాలను పరిశీలిస్తారు. అదే రోజు సాయంత్రం కరీంనగర్ చేరుకుని అక్కడే బస చేస్తారు.

జనవరి 2 ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఎస్‌ఆర్‌ఎస్‌పి కి నీరందించే శ్రీరామసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం పనులు జరిగే ప్రాంతాలను కెసీఆర్ సందర్శిస్తారు. దీంతో పాటు రాజేశ్వర్‌రాపుపేట, రాంపూర్‌లలో నిర్మాణంలో ఉన్న పంపు హౌస్ పనులను పరిశీలించి హైదరాబాదు తిరుగు ప్రయాణం అవుతారని అధికార వర్గాలు తెలిపాయి.