దేశం ‘తీర్ధం’ పుచ్చకోనున్న ‘కోట్ల ’

కర్నూలు, జనవరి 28: కేంద్ర మాజీ మంత్రి  కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఆయన సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతిలో కలుసుకోనున్నారు. కోట్లతోపాటు ఆయన సతీమణి సుజాతమ్మ, కుమారుడు రాఘవేంద్ర ముఖ్యమంత్రిని కలవనున్నారు. కోట్లకు మద్దతుగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా  ఆయన అనుచరులు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు.

గత ఎన్నికల్లో డోన్‌నుండి పోటీ చేసిన కోట్ల ఈ మారు తన కుటుంబసభ్యులు, సన్నిహితులను వచ్చే ఎన్నికల్లో పోటీచేయించేందుకు చంద్రబాబుతో భేటీ కానున్నారు.

కర్నూలు ఎంపి స్థానంతోపాటుగా మరో మూడు అసెంబ్లీ స్థానాలను తమ వర్గానికి కేటాయించాల్సిందిగా ఆయన కోరుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రితో చర్చల అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

కోట్ల సోదరుడు కోట్ల హర్ష వర్ధన్ రెడ్డి ఆదివారం వైసిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి ఆరవ తేదీన వైసిపిలో మద్దతుదారులతో కలసి చేరుతామని ఆయన చెప్పారు.

మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి తనయుడు, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి.