క‌విత ఇంటికి నేత‌ల క్యూ…. పెద్ద పోస్టులోకి….

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, ఇటీవ‌లే పొలిటిక‌ల్ రీ ఎంట్రీ ఇచ్చిన క‌ల్వ‌కుంట్ల క‌విత విష‌యంలో కొత్త టాక్ తెర‌మీద‌కు వ‌చ్చింది. trs operation akarsh start in nizamabad

 

కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఎన్నికైన నేప‌థ్యంలో, కవితకు ఎమ్మెల్సీతో సరిపెడతారా? అంతకుమించిన పదోన్నతి ఉంటుందా? అంటూ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చ‌ర్చ‌ జరుగుతున్న స‌మ‌యంలోనే ఆమె వ‌ద్దుకు ప‌లువురు నేత‌లు క్యూ క‌ట్ట‌డం చ‌ర్చ‌కు తెర‌లేపుతోంది.

ఓట‌మి త‌ర్వాత

నిజామాబాద్ పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌యిన అనంత‌రం ఏడాదిన్నర గ్యాప్‌ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు క‌విత‌. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బ‌రిలో దిగారు. పోలింగ్‌ సమయంలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు చేసిన కామెంట్స్‌పై ఇప్పుడు పార్టీలో హాట్ హాట్ చర్చకు తెర లేపాయి. కాబోయే మంత్రి అంటూ బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ చేసిన కామెంట్స్‌ ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. మరో ఎమ్మెల్యే గణేష్‌ గుప్త అయితే కవిత మరింత ఉన్నతమైన పదవి చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. తాజాగా ఆమెను ప‌లువురు పార్టీ నేత‌లు క‌లుస్తుండ‌టం హాట్ టాపిక్‌గా మారింది.

క‌విత‌కు ప‌ద‌విపై చ‌ర్చ

కవిత కేబినెట్‌లో చేరతారని కొందరు లెక్కలు వేసుకుంటుంటే.. కేబినెట్‌ హోదాతో సమానమైన పదవి వస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ సభ్యుల సంఖ్య ప్రకారం తెలంగాణలో ముఖ్యమంత్రి సహ కేబినేట్ సభ్యుల సంఖ్య 18కి మించకూడదు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఖాళీలు లేవు. ఒకవేళ కవితను కేబినేట్‌లోకి తీసుకోవాలంటే ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరో ఒకరు రాజీనామా చేయడం లేదా తప్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటువంటి పరిణామాల తర్వాత కవితను కేబినేట్‌లోకి తీసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీగా కవిత ఆ పదవిలో 14 నెలల పాటే ఉంటారు. అందుకే ఆ 14 నెలల కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆమె పాత్ర ఏంటన్నది పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.