‘కలయికకు ప్రాతిపదిక ఏమిటి?’

 

ఢీల్లీ,జనవరి 1: మహా కూటమికి ఇప్పటికే బీటలు పడ్డాయని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. మంగళవారం ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలను పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను కలుపుకుని మహాకూటమిగా  ఏర్పాటై తెరాసపై పోటీ చేసింది. తెలంగాణ అనుకూల, వ్యతిరేక శక్తులకు జరిగిన పోటీ ఇది. ప్రతిపక్షాలన్నీ కలిసి తెరాసను ఓడించాలనుకుని విఫలమయ్యాయి’ అని  ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇటువంటి ఫలితలే వస్తాయన్నారు. భిన్న భావజాలాలు కలిగిన పార్టీలన్నీ కలవాలనుకుంటున్నాయని విమర్శించారు.

కాంగ్రెస్‌, డీఎంకే కొన్ని కమ్యూనిస్టు పార్టీలు, తెలుగు దేశం పార్టీ కలిసి ఒక  కూటమిని ఏర్పాటు చేయాలనుకుంటుంటే, మరో వైపు తెరాస, తృణముల్‌ కాంగ్రెస్‌, బీజూ జనతా దళ్‌ కలిసి కాంగ్రెస్‌-బీజేపీయేతర ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నాయని విమర్శించారు. ఎన్డీఏ పాలనలో దేశం ఆర్థికాభివృద్ధి సాధిస్తోందని, ప్రపంచంలోనే అత్యధిక వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న దేశంగా భారత్ నిలిచిందని అన్నారు. తమ పాలనలో వ్యవసాయ రంగంలోనూ అత్యుత్తమ సేవలు అందుతున్నాయన్నారు. మోదీ మళ్లీ మన ప్రధాని కావాలా? లేదా అస్పష్టమైన విధానాలతో ఏర్పాటు అవుతున్న కూటమి అధికారంలోకి రావాలా? అనే విషయంపై ప్రజలు ఆలోచించి లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు వేయాలన్నారు.