‘రాజధాని గ్రామాల్లో దీక్షా శిబిరాలు ఎత్తివేయించాలి’

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: రాజధాని ప్రాంత గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉండగా దీక్షా శిబిరాల నిర్వహణను పోలీసులు ఎలా అనుమతిస్తున్నారని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని తన పాదయాత్రను అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు నిరసన దీక్షలను ఎలా అనుమతిస్తున్నారని ఆర్కే ప్రశ్నించారు. తక్షణం డిజిపి స్పందించి రాజధానిలో కొనసాగుతున్నదీక్షా శిబిరాలు, టెంట్‌లు ఎత్తి వేయించాలని ఆర్కే  డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అధికార వికేంద్రీకరణ దిశగా నడిపించమని రాజధాని ప్రాంత రైతులు కూలీలు కోరుతున్నారని అన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలనే అందరూ కోరుకుంటున్నారని చెప్పారు. భూముల తీసుకొని చంద్రబాబు మోసం చేశాడని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆర్కే అన్నారు.

దళితుల భూములనూ బలవంతంగా లాక్కున్నారని ఆయన ఆరోపించారు.

బినామి ఆస్తులు కాపాడుకోవడం కోసం చంద్రబాబు జోలె పడుతున్నారని విమర్శించారు. హెరిటేజ్ భూముల కోసం చంద్రబాబు భార్య ప్లాటినం గాజులు చందాగా ఇచ్చారని ఎద్దేవా చేశారు. పోలీసులకూ కులాలు, మతాలు, ప్రాంతాలను చంద్రబాబు  అంటకడుతున్నారని ఆర్కే మండిపడ్డారు.

రాజధాని నిరసన ఉద్యమాల్లో రైతుల ముసుగులో టిడిపి కార్యకర్తలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, అసాంఘిక శక్తులు ఉన్నారని ఆరోపించారు. రాజధానికి అమరావతి భూములు అనుకూలం కాదని తాము ముందే చెప్పామన్నారు. రాజధానిలో పోలీసులు అరాచకాలు చేస్తున్నారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తుంటే   డిజిపి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులనూ చంద్రబాబు అగౌరవ పరుస్తున్నారని ఆర్కే విమర్శించారు.