ఇది ఎన్నికల స్టంటే – మాయావతి

లక్నో, జనవరి 8: అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్‌లు కల్పించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ముందు ప్రకటించిన బిఎస్‌పి అధినేత్రి మాయావతి లోక్‌సభ ఎన్నికల ముందు బిజెపి తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల స్టంటేనని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముందు ఎటువంటి కసరత్తు లేకుండా అకస్మాత్తుగా ప్రతిపాదన బయటకు తెచ్చిన బిజెపి దీనికి న్యాయం చేయలేదని అన్నారు.

జనరల్ క్యాటగిరిలతో పాటు ముస్లింలు, ఇతర మైనార్టీ కేటగిరిలకు కూడా రిజర్వేషన్‌లు అమలు చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తుందని ఆమె తెలిపారు. దీనిపై గతంలోనే కేంద్రానికి లేఖ రాసామని అన్నారు. అగ్రవర్ణాలకు మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తూ ఇతర వర్గాలకు అన్యాయం చేయడం తగదన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు అమలు చేస్తున్న రిజర్వేషన్‌లను సమీక్షించాలనీ, జనాభా ప్రాతిపదికన కోటాను పెంచాలని ఆమె డిమాండ్ చేశారు.