కొడాలి నాని మళ్ళీ ఏమన్నారంటే..! ప్రభుత్వాన్ని కాదని ఆయన ఏమి చేయలేడు(ట)

 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నవంబర్ 4వ తేదీ లోపు రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఈ నెల 28వ తేదీ సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపై మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ప్రభుత్వంతో చర్చించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమి చెయ్యలేరు అన్నారు కొడాలి. ఎస్ ఈ సి నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను..నేను చెప్పిందే రాజ్యంగం అంటే కుదరదు అని పేర్కొన్నారు. నిమ్మగడ్డ మరో కొద్ది నెలలు మాత్రమే అధికారంలో ఉంటారు. ఆ తరువాత ఆయన హైదరాబాద్ వెళ్లిపోతారు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కన్నా రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు ముఖ్యమని పేర్కొన్నారు కొడాలి నాని. కరోనా మహమ్మారి భయంతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. దసరా తరువాత కరోనా సెకెండ్ వేవ్ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారనీ ఈ తరుణంలో స్థానిక సంస్థలను నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు కొడాలి నాని.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి సంస్థ అయినప్పటికీ ప్రభుత్వ సహకారం లేకుండా అడుగు ముందుకు వేసే పరిస్థితి ఉండదు. ఎన్నికల నోటిపికేషన్ విడుదల చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ముందుగా తెలియజేయాల్సిన అవసరం లేకున్నా, రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుండి క్లారిటీ తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వాయిదా అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు మధ్య తీవ్ర అఘాధం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంత్రి కొడాలి నాని..ఎస్ఈసీపై సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది.