తెలుగు రాష్ట్రాల్లో కోడ్ కూసింది

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ కోటా మండలి స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు,తెలంగాణలో ఐదు..మొత్తం పది స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 12వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాన్ని వెల్లడిస్తారు. నేటి నుంచి 28వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 1వ తేదీ వరకు నామినేషన్లను పరిశీలిస్తారు. 5వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువునిచ్చారు.

ఏపీలో శాసన సభ కోటాలో ఎన్నికైన మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, అంగూరి లక్ష్మి శివ కుమారి, పమిడి శమంతకమణి, ఆదిరెడ్డి అప్పారావు, తెలంగాణలో శాసన సభ కోటాలో ఎన్నికైన పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, టి.సంతోష్‌ కుమార్‌, మహ్మద్‌ సలీం, హోమ్ మంత్రి మహమూద్‌ అలీ పదవీకాలం పూర్తికానుండటంతో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. వీరి పదవీకాలం 2019 మార్చి 29 తో పూర్తికానుంది.