ఎన్నికల్లో డబ్బు పంపిణి తీవ్ర నేరం

అమరావతి, జనవరి 28: సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ సునీల్ అరోర అన్ని రాష్ట్రాల సిఎస్‌లను, డీజిపిలను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీ నుండి ఆయన సహచర ఎన్నికల కమీషనర్ అశోక్ లావసతో కలిసి అన్ని రాష్ట్రాల సిఎస్, డిజిపి, సిఇఓలతో వీడియో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఇసి అరోర మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి శాంతిభద్రతలు, ఇతర అంశాలపై సమీక్షించేందుకు వెంటనే సరిహద్దు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.

ఎన్నికల్లో డబ్బు పంపిణీని తీవ్రమైన నేరంగా పరిగణించి అలాంటి సంఘటనలు జరగకుండా నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే మీడియాలో వచ్చే పెయిడ్ న్యూస్ అంశంపై సకాలంలో చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేసిన మీడియా కోఆర్డినేషన్ కమిటీలు సక్రమంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు.

రానున్న ఎన్నికల నిర్వహణకుగాను వెంటనే అవసరమైన అధికారులు, సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి పెట్టి తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర స్థాయిలో వెంటనే సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహించాలని సిఎస్‌లను కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ సునీల్ అరోర ఆదేశించారు. అదేవిధంగా ఎన్నికల విధులకు నియమించే అధికారులు, సిబ్బందికి సకాలంలో మెరుగైన శిక్షణా కార్యక్రమాలను ఇవ్వాలని,  వాటిని ఉన్నతాధికారులు సక్రమంగా పర్యవేక్షించాలని చెప్పారు.

ఎన్నికలకు సంబంధించి సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, కుల, మతపరమైన ప్రభావతంతో అల్లర్లు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికలు సజావుగా జరిగేదుంకు వీలుగా పోలీంగ్ కేంద్రాల వారీ పోలింగ్ ఏర్పాట్లు తదితరం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసే వెబ్ కాస్టింగ్‌కు అవసరమైన సిసి టివి కెమెరాలను బయట కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నేరాల కేసులను సకాలంలో పరిష్కరించేందుకు వీలుగా న్యాయాధికారులతో సమన్వయం కలిగి సకాలంలో ఆయా కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ సునీల్ అరోరా అన్ని రాష్ట్రాల సిఎస్, డిజిపిలను ఆదేశించారు.

వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ మాట్లాడుతూ 2019 సాధారణ ఎన్నికలను సక్రంగా శాంతియుతంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకోనుందని వివరించారు.

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయానికి అవసమరైన అధికారులు, ఉద్యోగులను ఇప్పటికే నియమించగా మరి కొంతమంది అవసరమని కోరారని, వారిని కూడా వారం రోజుల్లో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారులు, ఇతర సిబ్బంది నియామకం, బదిలీకి సంబంధించి ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రానున్న ఎన్నికల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని సిఎస్ పునేఠ కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేశారు.

శాంతిభద్రతలు నిర్వహణకు సంబంధించి మాట్లాడుతూ గత సాధారణ ఎన్నికల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, ఇతర సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు తదితర ప్రాంతాల్లో మొత్తం 293 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగించడం జరిగిందని ఈసారి 350 కంపెనీలు అవసరం ఉంటుందని వివరించారు. ఎన్నికల సంబంధిందిత నేరాలకు సంబంధించి 14 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని సమీక్షించి త్వరగా పరిష్క‌రించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు సిఎస్ అనిల్‌చంద్ర పునేఠ వివరించారు.

ఎన్నికల్లో మద్యం పంపణీ తదితర అక్రమాలను నివారించేందుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 29 శాశ్వత చెక్ పోస్టులు, 19 సరిహద్దు మెబైల్ పార్టీలు పనిచేస్తున్నాయని వాటిని మరింత పటిష్టంగా పనిచేసేలా చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.

రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్పి ఠాకూర్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. గత ఎన్నికల్లో నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులు 14 పెండింగ్‌లో ఉన్నాయని వాటిని సమీక్షించి సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతర్ రాష్ట్ర సహరిద్దు కోఆర్డినేషన్‌పై సమీక్షించేందుకు ఫిబ్రవరి 5న తిరుపతిలో 5 సరిహద్దు రాష్ట్రాల పోలీస్, తదితర శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు డిజిపి వివరించారు.

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణపై ప్రజల నుండి కొన్ని ఫిర్యాదులందాయని, వాటిని పరిశీలించి సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రానున్న ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించేందుకు, తగిన నిధులు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోనుందని తెలిపారు.

ఓటర్ల నుండి ఫిర్యాదులు, ఇతర సమాచారం తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన 1950 కాల్ సెంటర్ విజయవంతంగా పనిచేస్తోందని చెప్పారు.

వీడియో సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్ట‌ర్ డి.సాంబశివరావు, అదనపు డిజి శాంతిభద్రతలు రవిశంకర్, ఎక్సైజ్ శాఖ కమీషనర్ లక్ష్మీ నర్సింహ, శాంతి భద్రతల ఐజి జి.శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.