YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు కడప ఎంపి అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి రేపు హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హజరుకావాల్సి ఉండగా, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఈ నెల 12న కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ నందు విచారణకు హజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎంపి అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. సీబీఐ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని రిట్ పిటిషన్ లో అభ్యర్ధించారు.

160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు కాబట్టి అరెస్టు చేయొద్దని ఆయన కోరారు. విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ కు అనుమతి ఇవ్వాలని, అంతే కాకుండా న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని అవినాష్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో ఏ 4 నిందితుడుగా ఉన్న దస్తగిరిని ఇప్పటి వరకూ సీబీఐ అరెస్టు చేయలేదనీ, దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా సీబీఐ ఎక్కడా వ్యతిరేకించలేదని అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. దస్తగిరి అక్కడ ఇక్కడ విని చెప్పిన మాటలు ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగిస్తున్నదనీ, తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాధారాలు లేకపోయినా ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. వివేకా హత్య కేసు లో దర్యాప్తు అధికారి పని తీరు పక్షపాతంగా ఉందని అవినాష్ రెడ్డి ఆరోపించారు.
తప్పుడు సాక్షాలు చెప్పేలా విచారణాధికారి కొందరిపై ఒత్తిడి తెస్తున్నారనీ, తాను విచారణలో చెప్పిన విషయాలను కూడా విచారణ అధికారి మార్చేస్తున్నారని అవినాష్ రెడ్డి చెప్పారు. నిందితుడు సునీల్ యాదవ్ గూగుల్ టేక్ అవుట్ ఫోన్ సిగ్నల్ లోకేషన్ చూపి సీబీఐ నన్ను వేధిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసిన అవినాష్ రెడ్డి.. ఘటనా స్థలంలో దొరికిన లేఖపై సీబీఐ దర్యాప్తు చేయడం లేదన్నారు. నోటీస్ దశలో విచారణ సాగుతుండగా, చార్జిషీట్ లో నేరస్తుడిగా సీబీఐ చిత్రీకరిస్తున్నదనీ, కేసులో నిజానిజాలను సీబీఐ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిష్పక్షపాతమైన విచారణ జరిగేలా ఆదేశించాలని ఎంపి అవినాష్ రెడ్డి పిటిషన్ లో కోరారు. అవినాష్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.