ఏపిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ పక్క యువగళం పేరుతో నారా లోకేష్, వారాహి యాత్ర పేరుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనాల్లో తిరుగుతూ ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జిల్లా పర్యటనలు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం జగన్మోహనరెడ్డి విపక్షాల తీరును తూర్పారబడుతున్నారు. ఈ తరణంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై మరో సారి విమర్శనాస్త్రాలు సంధించారు తెలుగు అకాడమి చైర్మన్, వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి.

నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ ..చంద్రబాబు తన సొంత పుత్రుడితో పాటు దత్తపుత్రుడు ఇద్దరినీ ప్రజలపైకి వదిలాడని, ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రతిపక్షాలకు ప్రజలు గుర్తుకు వస్తున్నారన్నారు. సొంత పుత్రుడు, దత్త పుత్రుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత తిరిగినా ప్రజలు నమ్మరని అన్నారు. తన రాజకీయం కోసమే చంద్రబాబు..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వాడుకుంటున్నారని లక్ష్మీపార్వతి అన్నారు. పవన్ ప్రయత్నాలు ఎక్కువ కాలం సాగవని అన్నారు. చంద్రబాబు నీడ నుండి పవన్ బయటకు రావాలని ఆమె సూచించారు. తనకు పవన్ పై సానుభూతి ఉందన్నారు. ఆయన చంద్రబాబు రాజకీయాలకు బలికావద్దని హితవు పలికారు.
చంద్రబాబు, లోకేష్ లు తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించాలని మరో సారి విజ్ఞప్తి చేశారు లక్ష్మీపార్వతి. నందమూరి అభిమానులు లోకేష్ ను రాజకీయాల నుండి తరిమికొట్టాలని కోరారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ చంద్రబాబు చేసిన అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదన్నారు. లోకేష్ కు రాజకీయాల పట్ల అవగాహన లేదని, ఆయన తెలుగు అనర్గళంగా మాట్లాడేందుకు కోటి రూపాయలు ఖర్చు పెట్టారు కానీ మైక్ పట్టుకున్న ప్రతి సారి తడబడతారని అన్నారు. తెలుగు ప్రజలు లోకేష్ ను ఎన్టీఆర్ మనువడిగా అంగీకరించడం లేదని అన్నారు. 2019 లోనే చంద్రబాబు రాజకీయ చాప్టర్ క్లోజ్ అయ్యిందన్నారు.
Janasena: పవన్ వారాహి యాత్రకు బ్రేక్ .. ఎందుకంటే..?