సోము వీర్రాజు… ఇటీవలే బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పార్టీ ముఖ్య నేత. రాబోయే కాలంలో బీజేపీని బలోపేతం చేస్తానని, 2024లో అధికారంలోకి తీసుకువస్తానని వీర్రాజు ప్రకటించారు.
అలా అందరి దృష్టిని ఆకర్షించిన వీర్రాజు తాజాగా సంచలన నిర్ణయాలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. తేడా వచ్చిన నేతలపై సస్పెన్షన్ వేటు వేయడమే తాజా టాక్. గత మూడు నెలల్లో అరడజను మందిని అధిష్టానం సస్పెండ్ చెయ్యడమో…నోటీసులు ఇవ్వడమో జరిగిందని కొందరి అంచనా.
కన్నా ఏం చేశారు?
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన విషయంలో గతంలో జరిగిన దానికి, ప్రస్తుతం జరుగుతున్న దానికి తేడా ఉందని నేతలు చెప్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నసమయంలో కొందరికి నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. ఒకరిద్దరిని సస్పెండ్ చేశారు. ఆ తరువాత వచ్చిన సోమే వీర్రాజు సమయంలో ఇవి మరింత ఎక్కువ అయ్యాయి. ఏపీ రాజధాని అమరావతికి అనుకూల వైఖరి తీసుకుంటున్న వారిని బీజేపీ సస్పెండ్ చేస్తోందని కొందరు అంటున్నారు.
వీర్రాజుకు మండితే అంతే సంగతి
మూడు రాజధానులకు ఒక పత్రికకు ఎడిటోరియల్ రాశారన్న కారణంతో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు ఓవీ. రమణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం అదే కోణం మరో నేతపై సస్పెండ్ వేటు పడింది. రాజధానికి అనుకూలంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణను బీజేపీ నుంచి పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సస్పెండ్ చేశారు. బీజేపీపై వ్యతిరేకంగా మాట్లాడినందుకు చర్యలు తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన లక్ష్మీపతి రాజాను కూడా అనుమతి లేకుండా చర్చలకు వెళుతున్నారని సస్పెండ్ చేశారు. పార్టీ లైన్ కు బిన్నంగా మాట్లాడుతున్నారని రామకోటయ్య అనే నేతకు నోటీసులు ఇచ్చారు. ఇలా ఏదో కారణంతో ఇప్పటి వరకు ఒ అరగడజను మందికి నోటీసు ఇవ్వడమో లేక సస్పెండ్ చెయ్యడమో జరిగింది. తాజాగా అధికార ప్రతినిధి లంకా దినకర్‌ను సస్పెండ్ చేశారు.
వీర్రాజు ఎందుకిలా చేస్తున్నారంటారు?
పార్టీలో విమర్శలు వస్తాయనో…ఎవరో అసంతృప్తి చెందుతారనో సైలెంట్ గా ఉండలేమని అధిష్టానం పెద్దలు చెపుతున్నారు. క్రమశిక్షణ విషయంలో తాము కఠినంగానే ఉంటామని ముఖ్య నేతలు చెప్తున్నారు. క్రమశిక్షణ చర్యల విషయంలో ఎవరినీ ఉపేక్షించడం ఉండదని వీర్రాజు మనసు తెలిసిన వారు అంటున్నారు. క్రమశిక్షణలో తేడా వస్తే బెత్తం పట్టుకొని దండించే మాస్టారులా వీర్రాజు వైఖరి ఉంటుందంటున్నారు. పార్టీ క్రమ శిక్షణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పేందుకే ఈ చర్యలు అంటూ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు.