ఇక ఎన్నికలే ఉండవు!

వచ్చేదంతా మోదీ సునామీ
బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్
ఉన్నావ్: ఈసారి దేశం పేరుతో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయని, వీటి తర్వాత ఎన్నికలే ఉండవని బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించారు. ‘‘మోదీ సునామీ దేశాన్ని మేల్కొలిపింది. 2024లో ఇక ఎన్నికలుండవని అనుకుంటున్నాను. పూర్తి నిజాయితీతో దేశం పేరుతో పోరాడే ఎన్నికలు ఇవే’’ అని ఆయన పార్టీ కార్యక్రమంలో అన్నారు. 2014లో ఉన్న మోదీ గాలి కాస్తా ఇప్పుడు సునామీగా మారిందని చెప్పారు. ఆయన ప్రధాని కాకుండా ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఇంతకుముందు కంటే కూడా ఫలితాలు మరింత బాగుంటాయని తాను భావిస్తున్నానన్నారు.

కొందరు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. ప్రియాంకాగాంధీని తీసురావడం, పొత్తులు పెట్టుకోవడం వారి పని అన్నారు. కానీ తమ నాయకుడు మోదీ మాత్రం ‘మోదీ ఉంటే దేశం ఉంటుంది’ అన్నారని గుర్తుచేశారు. ఈసారి ఎన్నికలు ఏ పార్టీ పేరుతోనూ జరగడం లేదని, దేశం పేరుతో జరుగుతున్నాయని ఆయన అన్నారు. తరచు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా సాక్షి మహరాజ్ బాగా పేరు సంపాదించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగాను, తూర్పు ఉత్తర ప్రదేశ్ ఇన్ చార్జిగాను ప్రియాంకా గాంధీని నియమించారు. మరోవైపు బీజేపీని ఎలాగైనా ఓడించాలని అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ, మాయాతికి చెందిన బీఎస్పీ కూటమి కట్టాయి. ఈ నేపథ్యంలోనే సాక్షి మహరాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు.