ప్రతిపక్షాలను కూడ తిడతావా

57 views

విజయవాడ,డిసెంబర్ 30: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  చంద్రబాబుపై చేసిన వాఖ్యలకు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఎట్లా స్పందించాలో అట్లానే స్పందించాయి. కాగల కార్యం గంధర్వులు చేశారన్నపద్ధతిలో వైఎస్‌ఆర్‌సిపి సంతోషపడింది. అయితే ఆ సంతోషాన్ని మరీ బాహాటంగా ప్రకటించకుండా ఊరుకున్నది. సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ కూడా స్పందించారు.

అయితే ఆయనకు అభ్యంతరకంరంగా తోచింది ఒక్క చంద్రబాబుపై విమర్శలే కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు సక్రమంగా పనిచేయడం లేదన్నకెసిఆర్ మాట ఆయనకు సహజంగానే అభ్యంతరకరంగా తోచింది. ఆదివారం విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ, ముందు తెలంగాణలో పాలనను సక్రమంగా చూసుకోవాలని హితవు పలికారు.

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిపై  కేసీఆర్ అభ్యంతర వ్యాఖ్యలను సహించబోమని ఆయన అన్నారు. కేసీఆర్‌ భాష మార్చుకోవాలని సూచించారు.  కేసీఆర్ దేశం మొత్తం తిరుగుతూ ప్రధాని మోదీకి బీ-టీమ్‌ తయారు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కెసిఆర్ ఎందుకు అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారో సామాన్య ప్రజనికానికి కూడా అర్థమవుతోందని రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రానికి ఏమీ చేయకుండా పర్యటనకు వెళ్తే నిరసనలు తప్పవని ప్రధానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించడంతోనే మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారని రామకృష్ణ తెలిపారు.