రేపే బాబ్రీ తీర్పు..! అంతటా అప్రమత్తం..!!

 

(లఖ్‌నవూ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

వివాదాస్పద బాబ్రీ మజీదు కూల్చివేత ఘటనకు సంబంధించి లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించనున్నది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

లఖ్‌నవూలో భారీ భద్రతా చర్యలు

బాబ్రీ కేసు తీర్పు నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశామని లఖ్‌నవూ డీసీపీ డికె పాండే తెలిపారు. కోర్టు పరిసర  ప్రాంతాలతో పాటు నగరంలో భారీగా పోలీసులను మోహరించామని చెప్పారు. వదంతులను ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు. జిల్లాలోని ప్రధాన కూడళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పాండే తెలిపారు.

కోర్టుకు హజరుకానున్న బీజెపి అగ్రనేతలు

బాబ్రీ కేసులో నిందితులుగా బీజెపీ అగ్రనేతలు ఎల్ కె అద్వానీ, మురళీమనోహర్ జోషి, ఉమా భారతి, కళ్యాణ్ సింగ్ సహా 49 మంది ఉన్నారు. అయితే వీరిలో 17మంది మరణించగా, మిగిలిన 32 మంది నిందితులు తీర్పు రోజు కోర్టుకు హజరుకావాలని ఇంతకు ముందే సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అదేశించారు. కాగా ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ఉమా భారతి కరోనా వ్యాధితో రిషికేష్ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు అనుమతి ఇస్తే తాను కోర్టుకు హజరు అవుతానని ఉమా భారతి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.  ఈ కేసులో నిందితులకు  వ్యతిరేకంగా సీబీఐ 351 సాక్షాలతో పాటు 600 డాక్యుమెంటరీ అధారాలను కోర్టుకు సమర్పించింది.