‘కుమ్మక్కు అయ్యింది వాళ్లే’

అమరావతి, ఫిబ్రవరి 22: ‘ముసుగులో సర్దుబాట్లు’ పేరుతో సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు.

జనసేన పేరును చెడగొట్టేందుకు వైసిపి, టిడిపిలు చేతులు కలిపాయని ఒక రాజకీయ పరిశీలకుడు తనకు చెప్పినట్లు శుక్రవారం ట్వీట్ చేశారు.

టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య డీల్ కుదిరిందని, పాతిక అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు జనసేనకు ఇచ్చేలా అవగాహన కుదిరిందని సాక్షి కథనంలో పేర్కొంది. ఈ విషయాలను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడే వెల్లడించినట్లు కథనంలో రాసింది.

దీనిపై ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ స్పందించారు. సాక్షి పేపరు పేరు ప్రస్థావించకుండానే తన దైన రీతిలో సమాధానాలు చెప్పారు.

జనసేన పేరును చెడగొట్టేందుకు ఆ రెండు పార్టీలు చూస్తున్నాయని, అందులో భాగంగానే ఉద్దేశపూర్వకంగా జనసేనపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

హైదరాబాద్ రాజ్‌భవన్‌లో కెసిఆర్‌ కలిస్తే వైసిపి, టిఆర్ఎస్‌తో జనసేన కలిసిందని టిడిపి ఆరోపిస్తుందనీ, నేడు జనసేన, టిడిపి కలిసిపోయారంటూ వైసిపి తప్పుడు ప్రచారాలను చేస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు..

ఈ తప్పుడు కథనాలపై పోరాడేందుకు నాకు ఒక టివి ఛానల్, పత్రిక ఉంటే బాగుంటుందని అనిపిస్తుందని అన్నారు.

‘ఎటువంటి పత్రిక, ఛానెల్ లేకుండానే బహుజన సమాజ్ పార్టీ (బిఎస్‌పి)ని సుస్థిరపరిచిన కన్షీరాం బాట నాకు స్పూర్తి, ఇంకా చెప్పాలంటే జన సైనికులే నాకు పత్రికలు, ఛానెల్స్ వంటివారు’ అని పవన్ ట్వీట్ చేశారు. ఇలాంటి తప్పుడు కథనాలు ఇంకా చాలా రాబోతున్నాయనీ, ప్రజలు ఇందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

జనసేన పార్టీ తమకు మద్దతు ఇవ్వాలని, స్వతంత్రంగా పోటీ చేయకూడదని ఆయా రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. తాను ఈ రాజకీయ యుద్ధంలో చిన్న పావు మాత్రమే కావొచ్చు, పోరాడే సైనికుడిని అని ఆయా రాజకీయ పక్షాలు గుర్తుంచుకోవాలని పవన్ అన్నారు.