చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరణ

అమరావతి: ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికులకు అండగా ఈ నెల 14న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తలపెట్టిన దీక్షకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్షకు అనుమతించాలని నగర పోలీస్, మున్సిపల్ కమిషనర్లను టీడీపీ కోరింది. అయితే, ఆయన దీక్షకు అధికారులు అనుమతి నిరాకరించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప ఇతర కార్యక్రమాలకు ఇక్కడ అనుమతి ఇవ్వలేవని వారు తెలిపారు. దీంతో, ప్రత్యామ్నాయంగా ధర్నా చౌక్ ను టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు. ఇందిరా గాంధీ స్టేడియంలో దీక్షకు అనుమతి నిరాకరించినప్పటికీ చంద్రబాబు దీక్ష కొనసాగుతుందని చెప్పారు.

ఏపీలో ఇసుకు రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇసుక కొరతతో రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కుదేలయిందని, కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల నారా లోకేష్ కూడా దీనిపై దీక్ష చేశారు.  ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు సైతం నవంబరు 14న దీక్ష చేయబోతున్నారు. ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.