ఏడాదికి 100 కోట్లు పెట్టి విదేశాలకు..!! మోడీ చేసిందిదీ..!

 

(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

నరేంద్ర మోడి అంటే ఒక బలమైన శక్తి, మోడి మాటే శాసనం. మోడి ఏది అనుకుంటే అది చేయగలరు. రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా తన చాణిక్య నీతి ఉపయోగించి బిల్లులను నెగ్గించుకురాగలరు. ఇతర పార్టీల నాయకుల మాదిరిగా ఆయన కుటుంబ బంధాలు లేవు. అవినీతికి పాల్పడాల్సిన అవసరమే లేదు. గుజరాత్‌ రాష్ట్రంలో ఆయన అందించిన ప్రజా రంజక పాలనతో వరుసగా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు.  మోడి చేతిలో దేశ అధికారం పెడితే గుజరాత్ మాదిరిగా దేశం అభివృద్ధి చెందుతుంది అని దేశంలోని సగటు మనిషి సైతం 2014 ఎన్నికలకు ముందు ఆలోచన చేశారు. మోడి మానియా ప్రభావం గుజరాత్ నుండి దాదాపు అన్ని రాష్ట్రాల్లో పని చేసింది. దానికి తోడు యుపిఎ ప్రభుత్వంలోని నేతలపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడం తదితర కారణాలతో 2014 ఎన్నికల్లో మోడి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

దేశ వ్యాప్తంగా సామాన్యుల హృదయాలను కూడా గెలుచుకుని తన వ్యక్తిగత ఛరిష్మాతో 2019 ఎన్నికల్లోనూ భాగస్వామ్య పక్షాలతో పని లేకుండానే ఏకంగా బిజెపికి 303 సీట్లు తెచ్చిపెట్టారు. ఇంతటి ఘనమైన చరిత్ర కల్గిన మోడీ కూడా తన విదేశీ పర్యటనల కోసం వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేయడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సామాన్యులు ముక్కున వేలు వేసుకుంటున్నారు. మోడీ విదేశీ పర్యటనలకు ఖర్చు చేసింది ఏడాదికి వంద కోట్ల పైమాటే. రాజ్యసభలో లిఖితల పూర్వకంగా లేవనెత్తిన ఒ ప్రశ్నకు విదేశాంగ సహాయ మంత్రి వి మురళీధర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల ఖర్చు వివరాలు వెల్లడించారు.

మోడీ ఎన్ని విదేశీ పర్యటలు చేశారంటే

2015 నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి 58 దేశాలలో పర్యటించారు. ఈ పర్యటనలకు గానూ 517.82 కోట్లు ఖర్చు అయ్యింది. చార్టర్ విమానాల ఖర్చులు, విమానాల నిర్వహణ, హాట్ లైన్ సౌకర్యాలు తదితరాల కోసం ఆ మేర ఖర్చు అయ్యింది.

ఏయే దేశాల్లో పర్యటించారంటే…

మోడీ అమెరికా, రష్యాలను అత్యధికంగా సందర్శించారు. ఈ రెండు దేశాలను ఐదేసి సార్లు వెళ్లి వచ్చారు. అదే విధంగా సింగపూర్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక దేశాలకు వెళ్లి వచ్చారు. గత ఏడాది నవంబర్ మొదట్లో థాయ్ లాండ్ ఆ తరువాత బ్రెజిల్ లో జరిగిన  బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా) సదస్సుకు చివరి సారిగా ఆయన విదేశీ పర్యటన చేశారు.

విదేశీ పర్యటనలు ఎందుకు…

ఆయా దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై భారతదేశ దృక్పథాలపై ఇతర దేశాల్లో అవగాహన కల్గించడం కోసం మోడీ పర్యటించారని కేంద్ర మంత్రి మురళీధరన్ పార్లమెంట్‌లో వెల్లడించారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ సహకారం, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ పర్యటనలు దోహదపడ్డాయని మంత్రి వివరించారు.