‘మహాకూటమి ఇండియాను ఐసీయూకే పంపిస్తుంది’

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ విపక్ష కూటమిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. వారిది మహాఘటబంధన్(మహా కూటమి) కాదని.. అదో మహామిలావత్(భారీ కల్తీ కూటమి) అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాళ్లంతా కలిసి దేశాన్ని ఐసీయూలోకి పంపిస్తారని అన్నారు.

దేశ వ్యాప్తంగా దాదాపు కోటిమంది బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇంతకుముందు ప్రభుత్వంలో ఈజ్ ఆఫ్ కరప్షన్ ఉండేదని.. దాని స్థానంలో ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ తీసుకొచ్చామని అన్నారు.

2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత దేశ ప్రజల అవసరాలు తీర్చామని, 2019 ఎన్నికల తర్వాత ప్రజల ఆకాంక్షలను పూర్తి చేయాల్సి ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘ఇండియా ఒక్కటిగానే నిలబడుతుంది, ఒక్కటిగానే పనిచేస్తుంది.. ఒక్కటిగానే ఎదుగుతుంది, ఒక్కటిగానే పోరాడుతుంది, ఒక్కటిగానే గెలుస్తుంది’ అని అన్నారు.

అంతకుముందు విపక్షాలు మోదీ నిర్వహించిన కాన్ఫరెన్స్‌పై విమర్శలు గుప్పించాయి. ఓ వైపు భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుంటే.. రాజకీయ కార్యక్రమాల్లో మునిగితేలుతారా? అంటూ మండిపడ్డాయి.