‘గ్లాసును మెరిపించండి’

49 views

విజయవాడ, జనవరి 4: రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కసరత్తు ప్రారంభించారు. విజయవాడ కేంద్రంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఈ నెల ఒకటవ తేదీ నుండి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు  అందుబాటులో ఉంటున్నారు.

ఈ నెల తొమ్మిదవ తేదీ వరకూ జిల్లాల వారీగా పార్టీ ముఖ్యనేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించే క్రమంలో భాగంగా శుక్రవారం నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లా ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు.   వామపక్షాలతో తప్ప ఎవరితోనూ కలిసి వెళ్లేది లేదని ఇప్పటికే పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్ కార్యకర్తలు, పార్టీ నేతలతో  విస్తృత స్థాయి చర్చలతో  బిజీబిజీగా గడుపుతున్నారు.

సమావేశాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ సిద్ధాంతాలు, పార్టీ మానిఫెస్టో, ఎన్నికల గుర్తు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడం తదితర అంశాలపై దిశానిర్ధేశం చేస్తున్నారు.