వ్యవసాయ బిల్లులకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి కోవింద్

 

(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

పార్లమెంట్ లో ఇటీవల ఆమోదం పొందిన మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ ఆదివారం ఆమోద ముద్ర వేశారు. ఈ వ్యవసాయ బిల్లులపై ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. సభ్యుల ఆందోళనల నేపథ్యంలో మూజువాణి ఓటుతో ప్రభుత్వం బిల్లులను ఆమోదించుకున్నది.

ఈ నేపథ్యంలో వివాదాస్పద బిల్లులను ఆమోదించవద్దంటూ ప్రతిపక్షాలు రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ కు వినతి పత్రం సమర్పించాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాళీదళ్ ఎన్ డీ ఎ నుండి వైతొలగిన విషయం తెలిసిందే. ఈ బిల్లుల వల్ల రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందనీ విపక్షాలు ఆరోపిస్తుండగా ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయనీ, రైతాంగానికి మేలు చేయడం కోసమే ఈ బిల్లులను తీసుకువచ్చామని అధికార పక్షం చెబుతున్నది. వివిధ రాష్ట్రాల్లో రైతులు ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నా, ప్రతిపక్షాలు వినతి పత్రాన్ని సమర్పించినా రాష్ట్రపతి కోవింద్ పార్లమెంట్ ఆమోదించిన బిల్లులకు ఆమోదముద్ర వేశారు.