‘తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ఇక చెల్లు చీటియే’

అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ వ్యాఖ్యానించారు. గాంధీ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఆ పార్టీ నేతలు పాదయాత్రలను నిర్వహించారు. బిజెపి ముఖ్యనేత సునీల్ దేవధర్  ఈ యాత్రను కడప జిల్లా పోట్లదుర్తి గ్రామంలో ప్రారంభించారు. ఈ యాత్రలో ఆయనతో పాటు సిఎం రమేష్ తదితరులు పాల్గొనగా కర్నూలు జిల్లాలో సంకల్ప యాత్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించగా రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో జరిగిన పాదయాత్రలో మరో రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన పాదయాత్రలో పార్టీ జాతీయ కార్యదర్శి సత్యమూర్తి, మాజీ మంత్రులు శనక్కాయల అరుణ, రావెల కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏపి, తెలంగాణ రెండు రాష్ట్రాలలో బిజెపి బలోపేతం అవుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బిజెపిదే హవా అని జోస్యం చెప్పారు.